అనుకున్నదే జరుగుతున్నది.. తెలంగాణ వైపునకు జలఖడ్గం దూసుకువస్తున్నది.. కృష్ణా జలాల్లో దశాబ్దాల అన్యాయం సరికాకముందే గోదావరిలోనూ ఆశలు గల్లంతవుతున్నాయి. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్టు.. రెండేండ్లుగా అరకొర సాగునీటితో అరిగోస పడుతున్న తెలంగాణ రైతాంగం మెడపై కత్తి వేలాడుతున్నది. కావేరి నది రూపంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. బనకచర్ల రూపంలో చంద్రబాబు.. ప్రాణహిత జలాలకు వేసిన గాలంలో తెలంగాణ విలవిలలాడబోతున్నది. పదేండ్లపాటు కనీసం తెలంగాణపై విషం చిమ్మే యోచన చేసేందుకు కూడా జంకినవాళ్లు ఇప్పుడు హైదరాబాద్ వేదికగానే గోదావరి జలాలను తన్నుకుపోయే ప్రాజెక్టులకు జీవం పోసేందుకు సిద్ధమయ్యారు.
గత కొంతకాలంగా కేంద్రం ఆడుతున్న కావేరి డ్రామాకు, బనకచర్ల పేరుతో చంద్రబాబు కూడా తోడై చారిత్రక అన్యాయానికి సిద్ధమవుతున్నారంటూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో హెచ్చరిస్తూనే ఉన్నది. దానినే నిజం చేస్తూ ఇటీవల చంద్రబాబు ఢిల్లీలో బనకచర్ల గుట్టును విప్పగా… ఇప్పుడు కేంద్రం వచ్చే నెల 24న గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై సమావేశాన్ని ఖరారు చేసింది.
Banakacherla | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జలసౌధలో జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నిర్వహిస్తున్న సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ సహా ఆరు రాష్ర్టాలకు రెండు రోజుల క్రితం అధికారిక సమాచారం చేరింది. తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దరిమిలా అనుసంధాన ప్రాజెక్టుపై ఇదే చివరి సమావేశంగా అధికారికవర్గాలే అభివర్ణిస్తున్నాయి. రెండేండ్లుగా రాజకీయ నాటకంతో మేడిగడ్డను ఎండబెడుతున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. మోదీ-చంద్రబాబు ద్వయం కుట్రల్ని ఛేదించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందా? అని సాగునీటిరంగ నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. నాడు పోతిరెడ్డిపాడు… నేడు కావేరి వయా బనకచర్ల… కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు శాశ్వతంగా విఘాతాన్ని కలిగించనున్నాయని ఆందోళన చెందుతున్నారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్రం పరుగులు పెడుతున్నది. పార్లమెంటు ఎన్నికల ముందు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను పంపించి నెల రోజుల్లో అభిప్రాయాలు చెప్పండి… లేకపోతే సమ్మతిగానే భావిస్తామని పేర్కొన్న మోదీ ప్రభుత్వం.. రాజకీయ సమతూకంలో భాగంగా కత్తిని కాస్త పక్కకుపెట్టింది. కానీ, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు… ఒకవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత జలాల వినియోగానికే వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు కొలువుదీరడంతో తెలంగాణపై జల యుద్ధాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తున్నది. వాస్తవానికి గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై ఎన్‌డబ్ల్యూడీఏ గత నెలలోనే సమావేశాన్ని నిర్వహించాలని తలపెట్టినప్పటికీ, దానిని వాయిదా వేశారు.
ఈలోగా చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేసుకొని ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్రానికి సమర్పించారు. అటుపిమ్మట అక్కడే అధికారికంగా బనకచర్ల ప్రాజెక్టు గుట్టును సవివరంగా మీడియా ముందు ఉంచారు. ఇది జరిగిన కొన్నిరోజులకే తాజాగా కేంద్రం రంగంలోకి దిగింది. వచ్చే నెల 24న అనుసంధాన ప్రాజెక్టుపై సమావేశాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర జల సంఘం, నదుల అనుసంధాన ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ అతుల్‌కుమార్‌జైన్ తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాలకు అధికారికంగా సమాచారం అందించారు. జలసౌధలో ఉదయం 11.30 గంటలకు జరగనున్న సమావేశంలో అనుసంధాన ప్రాజెక్టుపై అభిప్రాయాలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.
ఇక మిగిలిందల్లా… పోలవరం. పైగా ఇది పాత ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ భూభాగంలో నుంచే తరలించి, తమిళనాడులోకి తీసుకుపోవచ్చు. కానీ, ఇక్కడినుంచి తరలించేందుకు కూడా అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రమాణాలు, దేశంలో అమల్లో ఉన్న ట్రిబ్యునళ్లు, చట్టాలు.. ఇలా ఎలా చూసినా ఎగువ రాష్ర్టాల పూర్తిస్థాయి సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, మోదీ ప్రభుత్వం ఇవన్నీ అమలుచేసి ముందుకుపోతుందనే దానిపై సాగునీటి రంగ నిపుణులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కారు గత రెండేండ్లుగా మేడిగడ్డను ఎండబెట్టి ప్రాణహిత జలాల వినియోగాన్నే అటకెక్కించింది. దీంతోపాటు గత కొన్నిరోజులుగా బనకచర్ల రూపంలో కావేరి కత్తి దూసుకువస్తున్నదనే సంకేతాలు కనిపిస్తున్నా ప్రభుత్వ పెద్దలు ఎవరూ నోరెత్తడం లేదు.
కనీసం అభ్యంతరం వ్యక్తంచేసేందుకు కూడా కార్యాచరణ రూపొందించుకోవడం లేదు. దీంతో వచ్చే నెల జరగనున్న సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు కొన్ని అంశాలతో అభ్యంతరాలను వ్యక్తంచేయడం మినహా ప్రభుత్వం నుంచి ఎదురుదాడి పెద్దగా ఉండకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో పోలవరం నుంచైతే కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆంధప్రదేశ్‌ను కలుపుకొనిపోతే సరిపోతుందనే యోచనలో మోదీ సర్కారు ఉన్నదనే సమాచారం అందుతున్నది. ఇందులో భాగంగానే చంద్రబాబు.. బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, రూ.80వేల కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి సమర్పించినట్టు తెలిసింది. అందుకే, చంద్రబాబు సముద్రంలో కలిసే వృథా జలాల్లో 200 టీఎంసీలు వాడుకుంటామనే ప్రవచనాలు వల్లిస్తున్నారని అర్థమవుతున్నది. ఇలా ఏపీ 200 టీఎంసీలు, కావేరికి మరో 150 టీఎంసీల వరకు తరలించుకుపోతే 350-400 టీఎంసీల ప్రాణహిత జలాలకు ముప్పు పొంచి ఉందనేది సుస్పష్టం.
వచ్చే నెల 24న జరగనున్న సమావేశానికి ఆరు రాష్ర్టాలు హాజరు కానున్నప్పటికీ, అందులో శాశ్వతంగా నష్టపోయేది తెలంగాణనే. ఒడిశా పోలవరంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున తెలంగాణకు ఆ రాష్ట్రం తోడయ్యే అవకాశం ఉన్నది. కానీ, మిగిలిన వాటిలో కర్ణాటక.. ఉపనది మంజీరా ఉన్నందున పాల్గొంటున్నదే తప్ప ఈ ప్రాజెక్టుతో ఆ రాష్ర్టానికి లాభమూ లేదు.. నష్టమూ లేదు. ఛత్తీస్‌గఢ్ పోలవరం కాకుండా ఎగువన బరాజ్ నిర్మించి, ముంపు ఉన్నట్టయితేనే వ్యతిరేకిస్తుంది తప్ప పోలవరం నుంచి తీసుకుపోతే పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు లేవు. ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రయోజనం దృష్ట్యా సహకారాన్ని అందిస్తుంది.
అంతిమ లబ్ధిదారు తమిళనాడు. అందుకే తెలంగాణ-ఒడిశా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా పోలవరం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను పెంచి మరీ ముందుకుపోతున్న కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుపై అభ్యంతరాల్ని పట్టించుకుంటాయా? అనే సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో అనుసంధాన ప్రాజెక్టు ఆచరణలోకి రాగానే అందులో అంతర్భాగంగానే బనకచర్ల చేపట్టనున్నారనేది మోదీ-చంద్రబాబు ద్వయం కదుపుతున్న పావులను చూస్తే అర్థమవుతుంది. దేశ ప్రయోజనాలు… అనే కోణంలో ఈ రెండు జాతీయ ప్రాజెక్టులను చేపట్టి… వెంటనే గోదావరి ట్రిబ్యునల్ ప్రకటిస్తే.. ఇక గోదావరి జలాల్లోనూ తెలంగాణ నోట్లో మట్టేనని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.