సికింద్రాబాద్, మార్చి 30: లక్షలు వెచ్చిస్తున్నా….ఫలితం శూన్యం చోద్యం చూస్తున్న కంటోన్మెంట్ బోర్డు అధికారులు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని బాలంరాయి, రసూల్‌పురా, తిరుమలగిరి, కార్ఖానాలోని ప్రధాన బస్తీల్లో వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కొత్తగా వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం యేటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా బస్తీలు, ప్రధాన రోడ్లకు వీధి దీపాలు వెలుగులు పంచడం లేదు. దీంతో ప్రజలు అంధకారంలో మగ్గుతుండగా, ప్రధాన రోడ్లలో వీధి దీపాలు లేక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా కింది స్థాయి సిబ్బందిని ముందుకు నడిపించడంలో విఫలమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణాలోపం, ప్రజా ప్రతినిధులు బాధ్యతారాహిత్యం కారణంగా నియోజకవర్గంలోని దాదాపు అన్ని వార్డులలో వీధి దీపాల సమస్య కొనసాగుతుంది.
రాత్రి వేళ్లల్లో ఇబ్బందులు
నిర్వహణ సరిగా లేకపోవడంతో పలు బస్తీలు, ప్రధాన రోడ్లలో అంధకారం నెలకొంటుంది. పలు మురికివాడలు, బస్తీల్లో వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో రాత్రి వేళల్లో పాదచారులు ఇబ్బందులు పడుతుండగా, మహిళలు బయటకు రావడానికి జంకుతున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు ప్రధాన చౌరస్తాలు, కూడళ్లలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన హైమాస్ట్, మినీ హైమాస్ట్ లైట్లు చాలా వరకు పని చేయడం లేదు. ఒక వేళ ఎక్కడైనా పని చేసినా అవి ఒకవైపు పని చేస్తే మరో వైపు పనిచేయకుండా ఉంటున్నాయి. ఇలా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి, కార్ఖానా, జేబీఎస్, రసూల్‌పురా, అన్నానగర్, మడ్‌ఫోర్ట్, సిఖ్ విలేజ్‌లోని పలు బస్తీలు, కూడళ్లలో వీధి దీపా ల సమస్య ప్రజలకు ఇబ్బందికరంగా మా రింది. ఈ విషయమై అధికారులు, ప్రజా ప్రతినిధులకు స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారే కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
త్వరలో వీధిలైట్లు ఏర్పాట్లు చేస్తాం
విద్యుత్ దీపాల మరమ్మతుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎప్పడికప్పుడు సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. కంటోన్మెంట్‌లోని ప్రధాన కూడళ్లు, చౌరస్తాల్లో హైమాస్ట్ లైట్ల మరమ్మతులు పూర్తి చేయడం జరిగింది. ప్రతి కాలనీ, బస్తీల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరిస్తున్నాం. బోర్డు పరిధిలో వెలగని దీపాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నాం. తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాం.
– శ్రావణ్, విద్యుత్ అధికారి, కంటోన్మెంట్