‘జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కారులో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుంచి ఒక్కసారిగా అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. రెండు రోజుల కిందట నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది.’
సిటీబ్యూరో, మార్చి 23 ( నమస్తే తెలంగాణ ):వాహనదారులు.. జర భద్రమంటున్నారు నిపుణులు.. ప్రయాణం చేస్తున్నప్పుడు నిర్లక్ష్యం అస్సలు పనికిరాద్దంటున్నారు. వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. ఇంజన్, విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్స్ కారణంగా వాహనాలు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
కారణాలు ఇవీ..
ఎండాకాలం వచ్చిందంటే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. వాహనాల్లో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రోడ్డు ప్రమాదాలు. ఇతర వాహనాలు లేదా దేన్నైనా బలంగా ఢీకొట్టినప్పుడు ఆ రాపిడీకి నిప్పురవ్వలు ఎగిసిపడతాయి. అదే సమయంలో బ్యానెట్ కింద ఉండే ఫ్లూయిడ్లు, ఇంధనాలు, ఇంజన్, బ్యాటరీ, గ్యాస్ ట్యాంక్లాంటి వన్నీ చెల్లాచెదురవుతాయి.ఈ ఘర్షణలో చిన్న నిప్పురవ్వ వీటిపై పడినా క్షణాల్లో మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది.
వైరింగ్‌లో నాణ్యత లోపం, ఇంజన్ వేడెక్కడం, ఆయిల్, డీజిల్, పెట్రోల్, గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఎక్కువ దూరం తిరిగే వాహనాలను తరచూ తనిఖీ చేయించాల్సిన అవసరం ఉంది.
కాలపరిమితి ముగిసినవి, నాణ్యతలేని బ్యాటరీలతో మంటలు త్వరగా చెలరేగుతాయి. వాహనంలో అత్యంత ఉష్ణోగ్రత ఉండే వాటిలో కాటలిటిక్ కన్వర్టర్ ఒకటి. ఇది కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులను వడగట్టి కాలుష్యపు పొగను బయటకి పంపిస్తుంటుంది. దీనికి ముందుండేది ఇంజన్. స్పార్క్ ప్లగ్‌లు, ఇతర పార్ట్స్‌లో ఏదైనా లోపం ఉంటే ఇంజన్లో ఇంధనం సరిగా మండదు. అత్యధిక వ్యర్థాలు పోగవుతుంటాయి.అప్పుడు భారమంతా కాటలిటిక్ కన్వర్టర్‌పై పడుతుంది. సాధారణంగా 900 డిగ్రీల సెంటీగ్రేడ్‌తో వేడిగా ఉండే ఈ విభాగం 1100 డిగ్రీలకు చేరుతుంది. ఫలితంగా చుట్టు పక్కలుండే హీట్ షీల్డ్‌లు, మెటల్ ఫ్లోర్ ప్యాన్లు వేడెక్కి క్యాబిన్ ఇన్సులేషన్ కార్పెటింగ్‌లను కూడా దహించి వేస్తాయి.
బైక్‌కి హెడ్‌లైట్ నుంచి టెయిల్ లైట్ వరకు ఎలక్ట్రిక్ వైరింగ్ విస్తరించి ఉంటుంది. కారులో అయితే బ్యానెట్ కింద, ఇంటీరియర్‌లో, డోర్లు, కార్పెట్ కింద, సీట్లకింద, ఎక్కడంటే అక్కడ ఉంటాయి. గ్యాస్‌లు లీక్ కావడం, గ్యాస్కెట్, రేడియేటర్లలో పగుళ్లు కూడా మంటలు పుట్టడానికి కారణమవుతాయి.
పెట్రోల్, డీజిల్, ఇంజన్ ఆయిల్, ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్, పవర్‌స్టీరింగ్ ఫ్లూయిడ్, బ్రేక్ ఫ్లూయిడ్, కూలంట్ ఇవన్నీ కారు నడుస్తున్నప్పుడు సర్క్యూలేట్ అవుతుంటాయి. ఇవి ప్రవహించే ద్వారాలు, పైపులు, నిల్వ ఉండే రిజర్వాయర్లు పాడై లీకేజీ అయినా, పగలిపోయినా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
నిపుణులతోనే సర్వీసింగ్..!!
నగరంలో రోజు రోజుకు కార్ల వినియోగం పెరిగి పోతున్నది. వాటితో పాటు పుట్టగొడుగుల్లా సర్వీసు సెంటర్లు కూడా వెలుస్తున్నాయి. దీంతో అనేక మంది వాహనదారులు అధీకృత సర్వీసు డీలర్ల వద్ద వాహనాలు సర్వీసులకు ఇవ్వకుండా సాధారణ సెంటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్లను నిపుణుల వద్దే సర్వీసు చేయించాలి.
జాగ్రత్తలు..!!
బానెట్ నుంచి పొగ వస్తున్నా..చిన్నగా మంటలు మొదలైనా ఇంజన్ ఆఫ్ చేయాలి. బానెట్‌ను ఎత్తి ఇంజన్ చల్లబడే వరకు అలాగే ఉంచాలి.
కూలంట్ రిజర్వాయర్ ట్యాంక్‌ను తెరిచి తగినంత ఉందో లేదో ఓసారి పరిశీలించాలి.
ఇంజన్ చల్లబడే వరకు ఎదురుచూడాలి.
ప్రతీ కారు 4 వేల కిలోమీటర్లు తర్వాత సర్వీసింగ్‌కు ఇవ్వాలి.
పెట్రోల్, డీజిల్ గ్యాస్ సిలిండర్లు రవాణా చేయకూడదు.
వేసవిలో కార్లలో ఏసీల వాడకం ఎక్కువ. వీటిని ఎక్కువ సమయం హై మోడ్‌లో పెడితే కంప్రెషర్ మీద భారం ఎక్కువై ఇంజన్ కంపార్ట్మెంట్లో మంటలు అంటుకునే అవకాశం ఉంది. వీలైతే మధ్యమధ్యలో ఆఫ్ చేస్తూ ఉండాలి.
స్మోక్డిటెక్టర్స్ను అమర్చుకోవాలి. ఫైరెస్టింగ్ మిషన్ ఏర్పాటు చేసుకోవాలి.
ప్రతి మూడువేల కిలోమీటర్ల ప్రయాణించిన తర్వాత ఇంజన్లో కూలెంట్ వాటర్‌ను తప్పకుండా పోయాలి.
తనిఖీలు చేయించుకోవడం ముఖ్యం
కార్లలో ఎక్స్ట్రా లైటింగ్ కోసం వైరింగ్ చేయించుకుంటారు. దీనివల్ల ఓవర్ లోడ్ అయి షార్ట్‌సర్క్యూట్ జరుగుతుంటుంది. సర్వీసింగ్ చేసే సమయంలో రెగ్యులర్‌గా ఎక్స్ట్రా ఫిట్టింగ్‌లను తనిఖీ చేయించుకోవాలి.
-ఎం. మహేందర్ యాదవ్, మెకానిక్
అతివేగం వద్దు
ప్రతి వాహనాన్ని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత భద్రతా పరంగా సురక్షితమైనందని సర్టిఫికెట్ ఇస్తుంది. వాహనాలను కొనుగోలు చేసిన తర్వాత వాటి నిర్వహణ, అదనంగా ఏర్పాట్లు ముఖ్యంగా ఎలక్ట్రికల్ పరికరాల కోసం వైరింగ్‌ను చేయడం వల్ల స్పార్క్‌లు వచ్చి ప్రమాదాలు జరుగుతాయి. అలాగే అతివేగం కూడా పనికిరాదు.
-శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీవో, సికింద్రాబాద్
టైర్లు చెక్ చేసుకోవాలి
కారు నడిపేటప్పుడు వివిధ అంశాలను పరిశీలించాలి. ఉష్ణోగ్రత సూచిక కీలకం. లుబ్రికెంట్ ఆయిల్ రంగు సక్రమంగా ఉందా ? లేదా అనే అంశాలను పరిశీలించాలి. టైర్లు బాగున్నాయా.. గాలి ఉందా చెక్ చేసుకోవాలి.
-ఎండీ.పాషా, మెకానిక్