మేడ్చల్ రూరల్, మార్చి 12 : చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు. దుండిగల్ మండలం బౌరంపేటకు చెందిన చిల్లా సంతోష్(27), చింతా కృష్ణ(32) డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ నెల 8న ఉదయం గండిమైసమ్మలో కల్లు తాగారు. అనంతరం బండమాదారానికి వచ్చిన వీరు.. అక్కడ కల్లు దుకాణం తెరవకపోవడంతో తిరిగి పయనమయ్యారు.
ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్న పొలంలో ఒంటరిగా పనిచేస్తున్న శంకరమ్మ(52) మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు తెంపుకొని కారులో పారిపోయారు. గండిమైసమ్మలో మహదేవ్ జ్యువెల్లరీ దుకాణంలో రెండు పుస్తెలను కరిగించారు. ఆ తర్వాత తాకట్టు పెట్టి, డబ్బులు తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు పది పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. సీసీఫుటేజీలో దొరికిన ఆధారంతో సంతోష్, కృష్ణను పట్టుకున్నారు. సొత్తును స్వాధీనం చేసుకున్నారు.