సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): వ్యాపారం అంటే మగవాళ్లకు మాత్రమే అన్న మాటను చెరిపేస్తూ మహిళలు దూసుకువస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా మహిళలు స్థాపించిన స్టార్టప్‌లు జాతీయ, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మరోవైపు యువ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల కోసం నగరంలో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
మహిళలు స్థాపించిన స్టార్టప్‌లకు నిధుల సమీకరణ, భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉండేలా పలు కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం వీ హబ్ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది. చేతిలో డబ్బులు లేకపోయినా, ఆలోచనలే పెట్టుబడిగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. వీ హబ్‌లోనే కాదు టీ హబ్‌లోనూ మహిళలు టెక్నాలజీకి సంబంధించిన విభాగాల్లో పురుషులతో పోటీ పడి టెక్ స్టార్టప్‌లను ఏర్పాటు చేస్తూ సత్తా చాటుతున్నారు.
మహిళా స్టార్టప్‌ల కోసమే….
స్టార్టప్ రంగానికి ఉన్న ఉజ్వల భవిష్యత్తును గుర్తించి ప్రభుత్వం మహిళల కోసమే ప్రత్యేకంగా వీ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ మహిళలు ప్రారంభించిన స్టార్టప్‌లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. వి హబ్ సీఈవోగాను మహిళనే నియమించి, నిరంతరం స్టార్టప్ కార్యకలాపాలను మరింత విస్తరించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. దీంతో ఎందరో మహిళలు, యువతులు స్టార్టప్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. వారి ఆలోచనలను ఆవిష్కరణలుగా మలుచుకునేందుకు సాంకేతిక సహకారంతో పాటు నిధులు సమకూర్చడం, దేశ విదేశాల్లో వ్యాపార రంగంలో అనుభవం కలిగిన వారితో మార్గదర్శనం చేయించడంతో పాటు వ్యాపార విస్తరణకు అవసరమైన మార్కెటింగ్ వనరులను వి హబ్ వేదికగా అందిస్తున్నాం.
– దీప్తి రావుల, సీఈవో, వి హబ్
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు..
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మారుమూల గ్రామాల్లోనూ అద్భుతమైన ఆవిష్కరణలు జరిగేందుకు వీలుగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహిళా సర్పంచులను ఎంపిక చేసి వారికి ఇన్నోవేషన్ల గురించి తెలియజేయడంతో పాటు వారి గ్రామాల్లో ఇన్నోవేషన్ జరిగేలా టీఎస్ఐసీ సెల్ నిరంతరం పనిచేస్తోంది.
– డాక్టర్ శాంత తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్
మధుమేహంపై అనుభవమే.. స్టార్టప్‌కు దారి తీసింది
దువ్వూరు వర్షిత చిన్నతనంలోనే డయాబెటిస్ బారిన పడ్డారు. రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవడానికి రోజూ పరీక్షలు సర్వసాధారణం. ఇందుకోసం నెలకు రూ.4800 ల వరకు ఖర్చవుతుంది. పైగా ఎంతో నొప్పిని భరించాలి. ఇలాంటి బాధను ప్రత్యక్షంగా చూసిన నగరానికి చెందిన యువతి దువ్వూరు వర్షిత సరికొత్త ఆవిష్కరణను చేసింది. విమల్కుమార్తో కలిసి వివా లైఫ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా దేశంలోనే మొట్టమొదటి నాన్ ఇన్వాసివ్ గ్లూకో మీటర్‌ను రూపొందించింది. తన స్టార్టప్‌లో పెట్టుబడుల కోసం దేశంలోని ప్రముఖ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చాయి.
– దువ్వూరు వర్షిత,వివా లైఫ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్
ఫీజీ రూపకల్పన చేసిన.. స్టార్టూన్ ల్యాబ్ స్టార్టప్
ఫిజియోథెరపిస్టులు కలిసి స్టార్టూన్ ల్యాబ్ పేరుతో ప్రారంభించిన స్టార్టప్‌లో ఫీజీ పేరుతో ఒక పరికరాన్ని తయారు చేశారు. ఈ సంస్థను ఏర్పాటు చేయడంలో మైత్రేయి కొండపిది కీలక పాత్ర. ఆమె తన భర్తతో కలిసి ఫిజియోథెరపీ చికిత్స విధానాలను అధ్యయనం చేశారు. సుమారు రెండేండ్ల పాటు పరిశోధన చేసి, ఫీజీ పేరుతో శరీరానికి ధరించే స్మార్ట్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ పరికరాన్ని నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపిస్టులు వాడేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మెడిటెక్ స్టార్టప్ అయిన స్టార్టూన్ ల్యాబ్ స్టార్టప్‌లో ఇండియన్ ఏంజిల్ నెట్వర్క్ రూ.10.5 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.