
అమీర్పేట్, నవంబర్ 17: ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సామాజిక సేవలు అమూల్యమైనవని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. బుధవారం ఆస్టర్ ప్రైమ్ దవాఖాన ఆధ్వర్యంలో ఎస్ఆర్నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్, ఈఎన్టీ, న్యూరో, ఫిజియోథెరపీ, రక్త, మూత్ర టెస్టులు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వయోభారంతో ఉన్నా సామాజిక సేవాల్లో భాగస్వాములవుతూ ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రతినిధులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. నిరంతరం ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు, సామాజిక సేవలు, ఇన్డోర్ గేమ్స్, యోగా, ఉచిత వైద్య శిబిరాలతో బిజీగా గడుపుతూ ఆనందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండలి అధ్యక్షుడు కాసాని సహదేవ్గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.అనంతరెడ్డి, ప్రతినిధులు జి.యాదగిరి, మాణిక్రావు పటేల్, లింగమయ్య పెరుమాండ్ల తదితరులు పాల్గొన్నారు.