
ఖైరతాబాద్, నవంబర్ 15: బాల్య వివాహాలు వద్దని, ఆ వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. చిన్నారులు అద్భుతమైన చిత్రాన్ని గీశారు. ఆ చిత్రాన్ని మహిళా పోలీసు అధికారికి బహుమతిగా అందించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు బాల్య వివాహంపై చిత్రాన్ని గీసి, అదనపు డీజీ స్వాతి లక్రాకు సోమవారం బహూకరించారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ బాల బాలికలు చిన్నప్పటి నుంచి మంచి లక్ష్యాన్ని ఎంచుకోవాలని, అందరికీ ప్రేరణ కలిగించే ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం, షీ టీమ్స్ చిత్రాలతో ఉండే కీచైన్లను విద్యార్థినులకు బహుమతిగా అందించారు. వారి వెంట రూం టు రీడ్ సంస్థ ప్రతినిధులు రాధిక, ప్రియాంక తదితరులు ఉన్నారు.