
బోడుప్పల్, నవంబర్ 15 : బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని ‘రా’ చెరువు నాలా పనులను సోమవారం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా పనుల్లో భాగంగా అధికారులు, కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా దుర్గంధంతో కూడిన చెరువునీటిని కిందకు వదలడంతో కాలనీవాసులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలా పనులు పూర్తికాక ముందే అత్యుత్సాహంతో కొందరు స్థానికులు నీటిని వదలడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కాలనీలు మురుగునీటితో నిండిపోయాయన్నారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెరువునీటితో ముంపునకు గురైన ద్వారకానగర్ కాలనీవాసులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు, స్థానిక నాయకుల సమన్వయలోపంతో సమస్య తలెత్తిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న నాలా పనులు కొంతమేరకు దెబ్బతిన్నాయని, ఎలాంటి నష్టం జరగలేదన్నారు. నాలా పనులను వేగంగా చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సీసా వెంకటేశ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు శేఖర్‌రెడ్డి, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.