మలక్‌పేట, ఫిబ్రవరి 16: మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఎండుమిర్చికి రికార్డు ధర లభించింది. బ్యాడ్గీ రకం మిర్చి (క్వింటా) రూ.29,300లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఇటీవల మహబూబాబాద్ మార్కెట్లో ఇదే రకం మిర్చి రూ.27 వేల ధర పలికిన విషయం తెలిసిందే. ఈ ధరను మలక్‌పేట మార్కెట్ అధిగమించింది. మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఎక్కువ ధర అని.. అంతేకాక మార్కెట్ చరిత్రలోనే ఒకరోజు ఆదాయం(మార్కెట్ ఫీజు రూపంలో) రూ.4.50 లక్షలు రావడం తొలిసారని అధికారులు తెలిపారు.
బుధవారం మలక్‌పేట మార్కెట్‌కు గద్వాల నుంచి 7874 బస్తాల ఎండుమిర్చి వచ్చింది. బ్యాడ్గీ గ్రేడ్-1 రకం కావడంతో అత్యధికంగా రూ.29,300 ధర పలికింది. గ్రేడ్-2కు రూ.26 వేలు, 341 రకానికి రూ.21 వేలు, సూపర్-10 రకంలో గ్రేడ్-1కు రూ.17,500, గ్రేడ్-2కు రూ.11 వేలు, 273 రకం మిర్చిలో గ్రేడ్-1కు రూ.17 వేలు, గ్రేడ్-2కు రూ.12 వేలు, తేజాలో గ్రేడ్-1కు రూ.19 వేలు, గ్రేడ్-2కు 17 వేలు, బంగారం రకంలో గ్రేడ్-1కు రూ.15 వేలు, గ్రేడ్-2కు రూ.10 వేల ధర పలికినట్లు మలక్‌పేట మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి, మార్కెట్ ఉపసంచాలకుడు దామోదర్ తెలిపారు. తెల్లకాయలు రూ.6 వేల, నాసిరకం రూ.1500 పలికాయని ఆయన వివరించారు. గతేడాది ఇదే సీజన్లో మేలు రకం మిర్చి అత్యధికంగా రూ.15 వేలకు అమ్ముడుపోగా.. మధ్య రకం రూ. 13 వేలు, నాసిరకం రూ.9 వేలకు అమ్మిందన్నారు. మలక్‌పేట మార్కెట్‌కు భూపాలపల్లి, ఏటూరు నాగారం, గద్వాల్, అలంపూర్ ప్రాంతాల నుంచి మిర్చి వస్తున్నదని.. అయితే మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నామని దామోదర్ తెలిపారు.