
సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): క్రెడిట్ కార్డు రీడీమ్ పాయింట్లను నగదు కింద మారుస్తామంటూ.. మోసానికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం…ఎల్బీనగర్ సహారా ఎస్టేట్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణకు ఏప్రిల్లో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించిన నగదును జమ చేస్తామని చెప్పి.. పిన్ నంబరు, పాస్వర్డ్, ఓటీపీలను తీసుకుని ఖాతా నుంచి సుమారు రూ. 93వేలు కాజేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఢిల్లీలో నిందితుడు దీపక్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి కోర్టులో హాజరుపర్చి.. ఆదివారం నగరానికి తీసుకువచ్చి అరెస్టును ప్రకటించారు. దీపక్ కుమార్ తన స్నేహితుడు ముఖేశ్కుమార్తో కలిసి అమాయకుల ఖాతాలు కొల్లగొడుతున్నారని దర్యాప్తులో తేలింది. ముఖేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.