
తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 11 : తెలుగు భాషా సాహిత్యాలకు యెల్ది సుదర్శన్ ముంబాయిలో ఉంటున్నప్పటికి ఎనలేని సేవలు చేస్తున్నారని మహారాష్ట్ర పూర్వ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ప్రశంసించారు. సినారే, యెల్ది సాహిత్య వేదిక ముంబై ఆధ్వర్యంలో తెలంగాణ సారస్వత పరిషత్‌లో గురువారం సాయంత్రం యెల్ది సుదర్శన్ రచించిన ప్రేమాంజలి సామాజిక నవల, యెల్ది నీలాలు కవితల సంపుటి ఆవిష్కరణ సభ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అధ్యక్షతన ఘనంగా జరిగింది. సాహిత్యంపై మక్కువతోనే గొప్ప రచనలు సాగిస్తూ పాఠకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్న సుదర్శన్ శైలి ఎంతో గొప్పదన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక సంపాధకులు కె. శ్రీనివాస్, ప్రముఖ నవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, ఆచార్య టి. గౌరీశంకర్, జర్నలిస్టు బైసా దేవదాసు తదితరులు పాల్గొని సుదర్శన్ తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవలను కొనియాడారు.