నేడు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో రైతు మహా ధర్నా

సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా గ్రేటర్ టీఆర్ఎస్ ధర్నా చేపడుతున్నది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రైతుకు బంధువుగా తెలంగాణ ప్రభుత్వం.. రైతు రాబందుగా కేంద్రం ప్రభుత్వం అనే నినాదాన్ని టీఆర్ఎస్ శ్రేణులు వినిపించనున్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతుకు పెట్టుబడి సాయం, రైతు బంధు, రైతు భీమా, ఎరువులు, విత్తనాల సరఫరా ఆపలేదని, రైతు బంధువు సీఎం కేసీఆర్ అని ఈ సందర్భంగా మంత్రి తలసాని అన్నారు. ఈ ధర్నాలో నగరంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో పాటు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. వ్యవసాయాన్ని పండగ చేస్తూ..రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషితో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరిస్తుంటే ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో ధాన్యం కొనుగోలు చేయమంటూ అన్నదాతకు వరితో ఉరివేస్తున్న తీరును నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన మహాధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ సందర్భంగా తలసాని పిలుపునిచ్చారు.
ధాన్యం కొనేవరకు వదిలిపెట్టం
తెలంగాణలో పండే వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తాం. రైతులను ఇబ్బందులకు గురిచేసేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మహాధర్నాను నిర్వహిస్తాం. వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి పథాన నడిపిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిర్వీర్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్‌తో పాటు, రైతుబంధు, రైతుబీమా లాంటి అనేక పథకాలు అమలు చేస్తూ విప్లవాత్మక మార్పులు తెస్తోంది. బీజేపీ నాయకుల అసత్య ఆరోపణలను ప్రతిఒక్కరూ తిప్పికొట్టాలి. మహాధర్నాతో కేంద్రం మెడలు వంచడం ఖాయమన్నారు.
నిరసన సెగ ఢిల్లీకి తగలాలి..
రైతులకు అన్యాయం జరుగుతుంటే ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. రైతులకు గులాబీ దండు అండగా ఉంటుంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో నిర్వహించే మహాధర్నా నిరసన సెగ ఢిల్లీకి తగలాలి. ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో మరోమాట చెప్పడమే బీజేపీ విధానం. యాసంగిలో పండే పంటలను గుజరాత్ మాదిరిగా తెలంగాణలో కొనుగోలు చేయాలి. ఈ నిరసన కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి.