
జూబ్లీహిల్స్, జనవరి 27: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి పేర్కొన్నారు. గురువారం యూసుఫ్‌గూడ సర్కిల్ లోని పలు ప్రాంతాల్లో ఆశ, ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వల్ప లక్షణాలున్న వారు విధిగా వైద్య సిబ్బంది ఇస్తున్న మందులు వాడాలని సూచించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లు పూర్తిగా హోమ్ ఐసొలేషన్‌లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
యూసుఫ్‌గూడ సర్కిల్లో 50 బృందాలు..
యూసుఫ్‌గూడ సర్కిల్లో 50 బృందాలు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నారు. యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, బోరబండ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లలో 10 బృందాల చొప్పున సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లక్షణాలున్న వారికి హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నారు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేశ్ ఆధ్వర్యంలో ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి సర్వేను పరిశీలించారు.