హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): మరో వందేండ్లదాకా హైదరాబాద్‌లో మంచినీటికి ఢోకా ఉండదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. దశాబ్దాల సాగు, తాగునీటి కష్టాలు టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో దూరమయ్యాయని తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్కేవీ అనుబంధ హెచ్ఎండబ్ల్యూ ఎస్‌అండ్‌బీ (జలమండలి) కాంట్రాక్ట్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ద్వితీయ మహాసభలు జరిగాయి. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. స్వరాష్ర్టాన్ని సాధించుకొన్న తరువాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాలను స్వయం సమృద్ధివైపు నడిపిస్తున్నదని పేర్కొన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి జలాలతో హైదరాబాద్ నగరానికి తాగునీటిని నిరంతరాయంగా అందిస్తున్నామని వివరించారు.
ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు మరో వందేండ్లపాటు మంచినీటికి ఇబ్బందిలేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నదని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించిన ఉద్యోగులు, కార్మికులు కష్టపడి పనిచేయటం వల్ల దేశంలో తెలంగాణ తలెత్తుకొని నిలబడిందని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచటంలో జలమండలి కీలకంగా పనిచేస్తున్నదని వినోద్‌కుమార్ ప్రశంసించారు. జలమండలి అన్ని విభాగాలు చిత్తశుద్ధితో పనిచేయటంవల్ల హైదరాబాద్‌కు అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుసహ అన్నిస్థాయిలవారి పనితనాన్ని సీఎం కేసీఆర్ గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% ఇంక్రిమెంట్ ఇచ్చారని చెప్పారు. జీవో 14 విషయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దగ్గరికి సమస్యలతో వెళితే, వాటిని పరిష్కరించుకొనే తిరిగివస్తామన్న నమ్మకం ప్రతి విభాగంలో ఏర్పడిందని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్అండ్ఎస్బీ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు పీ నారాయణ, వీ సంతోష్, రాజారత్నం, బీ కిరణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, జీ పద్మారావు, నరేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.