హైదరాబాద్, అక్టోబర్ 22: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెనెరిక్ ఇంజెక్ట్‌బుల్ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా శుక్రవారం ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించింది. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ నికరలాభం 38 శాతం వృద్ధితో రూ.302 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.219 కోట్లు. కాగా గ్లాండ్ ఫార్మా ఆదాయం తాజా త్రైమాసికంలో 30 శాతం వృద్ధిచెంది రూ. 831 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు ఎగసింది. సమీక్షా కాలంలో కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి విడుదల చేయడం, ప్రస్తుత ఉత్పత్తుల అమ్మకాలు పెరగడంతో ఆదాయం వృద్ధి సాధ్యపడిందని గ్లాండ్ ఫార్మా ఎండీ, సీఈవో శ్రీనివాస్ సాదు తెలిపారు.