చిన్న పంట.. పెద్ద లాభం!

‘కూర’కు కొత్తరుచిని తీసుకొచ్చే కొత్తిమీర.. అన్నదాతకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నది. పెద్ద పంటలతో నష్టపోతున్నవారికి.. ఈ చిన్న పంటే ఆసరా అవుతున్నది. స్వల్పకాలంలోనే చేతికందుతూ.. కర్షకులను కష్టాలనుంచి గట్టెక్కిస్తున్నది. ఏడాదంతా డిమాండ్ ఉండే ఈ ఆకుకూర.. రైతును లాభాల బాట పట్టిస్తున్నది.
కొత్తిమీర.. వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే! అందుకే, దీనికి అన్నికాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. చిన్న కట్ట కూడా రూ.10 దాకా పలుకుతుంది. వేసవిలోనైతే.. రూ.20 పెట్టినా దొరకని పరిస్థితి. ఇక కొత్తిమీర విత్తనాలది (ధనియాలు) సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖ స్థానం. ఇటు వ్యవసాయంలోనూ రైతులకు నిత్య ఆదాయం తీసుకొచ్చే పంటగానూ గుర్తింపు పొందింది. 365 రోజులూ సాగవుతూ, కర్షకుల ఇంట కనక వర్షం కురిపిస్తున్నది. కొత్తిమీర పంట నెలలోనే చేతికందుతుంది. అందుకే, ఈ చిన్న ఆకుకూరను సాగు చేయడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. తక్కువ నీటితో వర్షాధారంగానూ సాగు చేస్తుంటారు. ఈ పంటకు చీడపీడల సమస్య కూడా తక్కువే.
- పంట రకాలు
- కొత్తిమీర ఆకులతోపాటు వాటి విత్తనాలు (ధనియాలు) కూడా మంచి ధర పలుకుతాయి. అందుకోసమే, రెండు విధాలుగా దిగుబడిని ఇచ్చే రకాలను సాగు చేసుకుంటే మంచిది. వాతావరణంతోపాటు నేల స్వభావాన్ని బట్టి విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి.
- సింధు : దీని పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 4 – 5 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుంది. ఈ రకంలో సుగంధ తైలం (0.4%) ఉంటుంది. గింజ నాణ్యత అధికం.
- సాధన : పంట కాలం 105-110 రోజులు. ఎకరానికి 4 – 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఆకుతోపాటు గింజల్లోనూ అధిక దిగుబడిని సాధించవచ్చు. పేను బంకను తట్టుకుంటుంది. నల్లరేగడి నేలల్లో దిగుబడి ఎక్కువ.
- స్వాతి : పంట కాలం 80-85 రోజులు. ఎకరానికి 3 – 4 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. తేమ నిల్వ తక్కువగా ఉండే నేలలకు అనుకూలం. బూజు తెగులును తట్టుకుంటుంది.
- సుధ : పంటకాలం 100 రోజులు. ఎకరానికి 5 – 6.5 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. అధిక సుగంధ తైలం కలిగి, అధిక దిగుబడినిచ్చే రకం.
- వీటితోపాటు సురుచి రకం తక్కువ సమయంలో (35-55 రోజుల్లో) కోతకొస్తుంది. సుస్థిర రకాన్ని వర్షాధారంగా సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
అనుకూలమైతేనే..
అనుకూలమైన నేలల్లోనే కొత్తిమీర సాగు చేయడం మంచిది. అప్పుడే దిగుబడి అధికంగా ఉంటుంది. మురుగు నీటి సౌకర్యమున్న ఇసుక, ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. వర్షాధారంగా సాగు చేయాలనుకుంటే.. ఒండ్రు నేలలు ఉత్తమం. ఉదజని సూచిక 6-8 మధ్య ఉండాలి. 20-25 డిగ్రీల ఉష్ణోగ్రతలో, చల్లని, పొడి వాతావరణంలో కొత్తిమీర బాగా పెరుగుతుంది. విత్తడానికి ముందే భూమి మొత్తం మెత్తటి పదును వచ్చేలా 3-4 సార్లు దుక్కిదున్నాలి. సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ. ఎడం ఉండేలా గొర్రు సాయంతో విత్తుకోవాలి. విత్తేముందు విత్తనశుద్ధితోపాటు 5-6 గంటల సేపు నానబెట్టి, ఆరనిస్తే త్వరగా మొలకెత్తుతుంది.
విత్తనశుద్ధి
కొత్తిమీర సాగులో విత్తనశుద్ధి కీలకం. ఎకరానికి ఆరు కిలోల విత్తనం అవసరం. కిలో విత్తనానికి 100 గ్రా. అజోస్పిరిల్లమ్ (బయోఫర్టిలైజర్) కలిపి శుద్ధిచేసుకోవాలి. దీనివల్ల దిగుబడి 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. ఎండు తెగులు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో సాగు చేయాలనుకొంటే, రెండుమూడేండ్లకోసారి పంట మార్పిడి చేయాలి. వేసవిలో లోతు దుక్కులు దున్నుకొంటే, తెగులును కలిగించే శిలీంధ్రాన్ని అదుపు చేయవచ్చు. కిలో విత్తనానికి ఒక గ్రా. కార్బెండజిమ్‌ను కలిపి విత్తనశుద్ధి చేయడం వల్ల తెగులు రాకుండా కాపాడవచ్చు. వర్షాధార పంటలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి లీటర్ నీటిలో 10 గ్రా. పొటాషియం డై హైడ్రోజన్ పాస్ఫేట్‌ను కలిపి, ఆ ద్రావణంతో విత్తనాలను 16 గంటలపాటు శుద్ధి చేయాలి.
ఎరువుల యాజమాన్యం
పంటకు అందించే ఎరువులపైనే కొత్తిమీర దిగుబడి ఆధారపడి ఉంటుంది. అయితే, పంటను వర్షాధారంగా సాగు చేస్తున్నారా? లేదా సాగునీటిని ఆధారంగా చేసుకొని సాగు చేస్తున్నారా అనేదానిపైనే ఎరువుల మోతాదు ఆధారపడి ఉంటుంది. వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో సాగు చేస్తున్నట్లయితే, ఆఖరిదుక్కిలో ఎకరానికి నాలుగు టన్నుల పశువుల ఎరువుతోపాటు 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. అదే నీటిపారుదల కింద తేలికపాటి నేలల్లో అయితే.. పైన చెప్పిన మోతాదుతోబాటు విత్తిన 30 రోజుల తర్వాత 12 కిలోల యూరియా, 7 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన వెంటనే బరువైన నేలల్లో ఎకరానికి 1.3 లీ. పెండిమిథాలిన్, తేలిక నేలల్లో అయితే 1 లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
అంతర కృషి
విత్తనాలు వేసిన 30 రోజులలోపు కలుపు తప్పకుండా తీయాలి. కుదురుకు రెండు మొక్కలను మాత్రమే ఉంచి, మిగతా వాటిని తీసివేయాలి. ఇలా పంటను పలుచన చేయడం వల్ల మొక్కల పెరుగుదల బాగుంటుంది.
సస్యరక్షణ
ఇతర పంటలతో పోలిస్తే కొత్తిమీరలో చీడపీడల బెడద తక్కువ. అయితే, కాలానుగుణంగా పంటను గమనిస్తూ, తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు దక్కుతాయి.
పేను బంక : ఇవి ఆకులు, పూత నుంచి రసాన్ని పీల్చి, గింజలు ఏర్పడకుండా చేస్తాయి. దీని నివారణకు లీటర్ నీటిలో 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. మిథైల్ డెమిటాన్ లేదా 2.0 మి.లీ. డైమిథోయేట్ కలిపి పిచికారీ చేయాలి.
‘కొత్తిమీర’.. సాగు సులభం అధిక ఆదాయం
ఎర్రనల్లి : ఇవి ఆకుల అడుగున గుంపులుగా చేరి, రసాన్ని పీలుస్తాయి. లీటర్ నీటిలో 3 గ్రా. నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేయడం వల్ల ఎర్రనల్లిని నివారించవచ్చు.
తామర పురుగులు : ఈ పురుగులు ఆకులను, పూతను గీకి, రసాన్ని పీల్చి పంటను నష్టపరుస్తాయి. వీటిని నివారించేందుకు లీటర్ నీటిలో 2 మి.లీ. ఫిప్రొనిల్ లేదా 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 2.0 మి.లీ. మిథైల్ డి డెమిటాన్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
పొగాకు లద్దెపురుగు : ఇవి ఆకులను, పూతను, గింజలను తిని.. నష్టాన్ని కలుగజేస్తాయి. లీటర్ నీటిలో 1 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేస్తే, లద్దెపురుగు ఉధృతి తగ్గుతుంది.
బూడిద తెగులు : ఈ తెగులు సోకిన పంటలో ఆకుల అడుగున చిన్న చిన్న బూడిద రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇవి ఆకుల పైభాగానికి, కాండానికీ వ్యాపిస్తాయి. దీని నివారణకు లీటర్ నీటిలో 1 గ్రా. కార్బెండజిమ్ కలిపి పిచికారీ చేసుకోవాలి.
గింజ నలుపు తిరుగుట : పంటలో ఈ సమస్యను గుర్తిస్తే.. లీటర్ నీటిలో 3 గ్రా. మాంకోజెబ్ కలిపి, పూత నుంచి గింజ పట్టే దశల్లో రెండుసార్లు పిచికారీ చేయాలి.
కోత / దిగుబడి
పంట రకం, కాలాన్ని బట్టి 90-110 రోజుల్లో కోతకొస్తుంది. ధనియాలు ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగులోకి మారే సమయంలో కోయాలి. ఆలస్యమైతే కోత సమయంలో గింజలు రాలిపోతాయి. అంతేకాకుండా, పంటను ఉదయం పూట మాత్రమే కోయాలి. పంటకోసిన తర్వాత 2- 3 రోజులు పొలంలోనే ఆరనిచ్చి, నూర్చుకోవాలి. ఆ తర్వాత విత్తనాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిల్వ ఉంచిన సంచులపై మలాథియాన్ చల్లడం, విత్తనాన్ని అప్పుడప్పుడూ ఎండ బెట్టడం వల్ల నిల్వలో ఆశించే పురుగులను కట్టడి చేయవచ్చు. కొత్తిమీర కోసమైతే 30-40 రోజుల తర్వాత మొక్కను వేర్లతోసహా పీకి, వెంటనే మార్కెట్‌కు తరలించాలి. కొత్తమీర కోసం ఒకేసారి పొలమంతా విత్తనం వేయకుండా దఫాలుగా వేయడం వల్ల అవసరం మేరకే మార్కెట్‌కు తరలించవచ్చు.
ఇవి తప్పొద్దు
- చేనులో నిర్దేశించిన మోతాదుకు మించి విత్తనం వేయవద్దు.
- సాధన, సింధు రకాలను త్వరగా బెట్టకు వచ్చే నేలల్లో వర్షాధారంగా సాగు
- చేయకూడదు.
- పైరు పూర్తి పూత మీద ఉన్నప్పుడు గంధకం (ఎర్రనల్లి, బూడిద తెగులు నివారణ కోసం) పొడి చల్లకూడదు.
- పైరు కోసిన తర్వాత 2-3 రోజుల కంటే ఎక్కువగా పొలంలో ఎండబెట్టవద్దు.
- పంట మార్పిడి అవలంబించడం మేలు.
తక్కువ సమయంలోనే..
కొత్తిమీర విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. రుచీ పచీ లేని హైబ్రిడ్ రకాల కంటే.. లోకల్ వెరైటీలకు ప్రాధాన్యమివ్వాలి. ఎక్కువ స్థలంలో సాగు చేయాలనుకొంటే.. ఒక పంట పూర్తవుతుందనగా, మరో పంట సాగు చేసుకోవాలి. దీనివల్ల ఏడాది పొడవునా పంట చేతికొస్తూ ఉంటుంది. మార్కెట్లో రేటును బట్టి, పంటను కోసుకొనే వెసులుబాటు ఉంటుంది. కొత్తిమీర సాగుకు నీటి అవసరం చాలా తక్కువ. నీటి ఎద్దడి ఉండే రైతులకు కొత్తిమీర మంచి ఆప్షన్.
– డాక్టర్ . పిడిగెం సైదయ్య
శాస్త్రవేత్త, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

