మాటలను అక్షరాలుగా మార్చే ‘వాయిస్-టు-టెక్ట్స్’ యాప్స్ ఎన్నో ఉన్నాయి. అయితే, అవన్నీ.. మనం చెప్పే ప్రతి పదాన్నీ ఉన్నది ఉన్నట్లుగానే టైప్ చేస్తుంటాయి. మాటల్లో దొర్లే.. అమ్మ్, ఆహ్ లాంటి అనవసర పదాలను కూడా ఇన్సర్ట్ చేస్తాయి. అయితే, ‘విస్పర్ ఏఐ’ సంస్థ రూపొందించిన ‘విస్పర్ ఫ్లో’ యాప్.. ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపుతున్నది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. అంటే, మీరు మాట్లాడే మాటలను పూర్తిగా అర్థం చేసుకుని.. వ్యాకరణ దోషాలు లేకుండా, మాటలను అందంగా మార్చేస్తుంది.
మీరు వాడుతున్న యాప్‌లో వెంటనే టైప్ చేస్తుంది. సంభాషణలో దొర్లే అనవసర పదాలను సమర్థంగా తొలగిస్తుంది. తడబాట్లు, నత్తిని కూడా ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. అంతేకాదు.. కామా, ఫుల్స్టాప్ లాంటి పంక్చుయేషన్ మార్క్స్ గురించి ఆలోచించకుండా ఈ యాప్‌తో సాధారణ వేగంతో మాట్లాడవచ్చు. మాటల సందర్భంలో ఏదైనా వాక్యాన్ని మార్చినా వెంటనే ఇది గుర్తిస్తుంది.
ఉదాహరణకు.. ‘మనం ఐదు గంటలకు కలుద్దాం! కాదు కాదు.. ఆరు గంటలకు’ అని అంటే, ఇది వెంటనే గుర్తించి, ‘మనం ఆరు గంటలకు కలుద్దాం’ అని సరైన మాటల్నే టైప్ చేస్తుంది. వాట్సాప్, జీమెయిల్, స్లాక్, నోషన్, చాట్జీపీటీలతోపాటుడిజైనింగ్, కోడింగ్ టూల్స్ లాంటి ప్రతీ టెక్ట్స్ బాక్స్‌లోనూ ఈ యాప్ పని చేస్తుంది. అంతేకాదు.. ఏదైనా వ్యాపారానికి సంబంధించిన పేర్లు, సాంకేతిక పదాలను యాప్‌లో సేవ్ చేసుకుంటే, వాటి గురించి మాట్లాడినప్పుడు తప్పులు లేకుండా కచ్చితత్వంతో టైప్ చేస్తుంది.
ఇందులోని వాయిస్ స్నిప్పెట్స్ ఆప్షన్ ద్వారా.. మీరు తరచుగా ఉపయోగించే పెద్ద పేరాలను ఒక చిన్న వాయిస్ కమాండ్‌తో క్షణాల్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా.. తెలుగుతో సహా 100 కంటే ఎక్కువ భాషలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తించి టైప్ చేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌తోపాటు విండోస్, మ్యాక్ ఓఎస్లలోనూ దీనిని శుభ్రంగా వాడుకోవచ్చు. మొబైల్లో ఒక కీబోర్డ్‌లా, స్క్రీన్‌పై ఫ్లోటింగ్ బటన్‌లా.. డెస్క్‌టాప్‌లో ‘షార్ట్‌కట్ కీ’ ద్వారా పనిచేస్తుంది. వాయిస్-టు-టెక్ట్స్‌ను ఎక్కువగా ఉపయోగించేవారికి శ్రమను తగ్గిస్తుంది.