సైదాబాద్, నవంబర్ 16: విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చంపాపేట సబ్ డివిజన్ అధికారులు మంగళవారం ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణికాలనీలో విద్యుత్ కనెక్షన్లను తనిఖీలు చేశారు. సబ్ డివిజన్ ఏడీఈ రాజేందర్, ఏఈ విజయ్‌కుమార్ తమ సిబ్బందితో కలిసి బస్తీలో కలుగుతున్న విద్యుత్ అంతరాయాన్ని నివారించటం కోసం క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. స్థానికంగా నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడం కోసం ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ల వినియోగం, కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలను పరిశీలించారు. అక్రమ విద్యు త్ కనెక్షన్ల పరిశీలన, విద్యుత్ వినియోగం, దుర్వినియోగంతో వస్తున్న నష్టాలకు గల కారణాలను, విద్యుత్ వైర్ల క్రమద్ధ్దీకరణ వంటి అనేక అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏడీఈ రాజేందర్, ఏఈ విజయ్‌కుమార్‌లు మాట్లాడుతూ సింగరేణికాలనీలో తరుచూ కలుగుతున్న విద్యుత్ అంతరాయాన్ని శాశ్వతంగా తొలగించటానికి కనెక్షన్ల సర్వేను నిర్వహించామని, అయితే కొంతమంది విద్యుత్ కనెక్షన్లను తొలగించడానికి, కేసులు పెట్టడానికి అధికారులు వచ్చారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు అందిస్తామని వారి ఆదేశాలమేరకు గుడిసెవాసులకు మెరుగైన విద్యుత్‌ను అందిచండంతోపాటు, విద్యుత్ మీటర్లు లేని వారికి కొత్తగా మీటర్లను అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అక్రమ కనెక్షన్లతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లపై పెరిగిన లోడ్‌ను తగ్గించటానికి, అనుసరించాల్సిన అంశాలను అధ్యయనం చేయడమే ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు.
సింగరేణికాలనీ గుడిసెవాసులందరికీ విద్యుత్ మీటర్లను ఇవ్వాలని ఐఎస్ సదన్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మెట్టు భాస్కర్‌రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా విద్యుత్‌శాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందజేసి, సింగరేణికాలనీలో విద్యుత్ ఇబ్బందులను తొలగించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు.