Holding Urine | మన శరీరంలో ఎక్కువగా ఉండే ద్రవాలను, విష పదార్థాలను మూత్రపిండాలు మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. మనం ఎంత ఎక్కువగా మూత్రవిసర్జన చేస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది. సాధారణంగా మనం రోజుకు 6 నుండి 8 సార్లు మూత్ర విసర్జన చేయాలి. అయితే మనలో చాలా మంది మూత్రవిసర్జనను ఆలస్యం చేస్తూ ఉంటారు. మూత్రం వచ్చినప్పటికీ దానిని విసర్జించకుండా అలాగే ఉంటారు. ఇలా చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇది సామాజిక, ఆరోగ్యపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉండే సామాజిక పరిస్థితుల వల్ల మూత్రాన్ని ఆపుకోవాల్సి వస్తుంది. టాయిలెట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ప్రయాణాలు చేసే సమయంలో అలాగే వారు చేసే వృత్తి కారణంగా, పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రంగా ఉండని కారణంగా, కొందరు వారు చేసే పనిలో నిమ్మగ్నమై కూడా మూత్రవిసర్జన చేయకుండా మూత్రాన్ని బిగపట్టుకుని అలాగే ఉంటారు.
ఈ మధ్య కాలంలో చదుకునే పిల్లలు కూడా సరిగ్గా మూత్రవిసర్జన చేయకుండా ఉంటున్నారు. అయితే ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేసినప్పటికీ దీనిని అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మూత్ర విసర్జర చేయకుండా మూత్రాన్ని బిగపట్టుకోవడం వల్ల మన మొత్తం ఆరోగ్యానికి హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల తీవ్రమైన మూత్రాశయ, మూత్రపిండాల సమస్యలు వస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు. మూత్ర విసర్జన చేయాలనే కోరికను విస్మరించడం వల్ల మూత్రాశయం దాని సాధారణ సామర్థ్యానికి మించి సాగుతుంది. దీని వల్ల క్రమంగా మూత్రాశయ కండరాలు బలహీనపడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇది మూత్రాశయం అసంపూర్ణంగా ఖాళీ కావడానికి దారి తీస్తుంది. ఇది మూత్రనాళాల ఇన్పెక్షన్లను (యూటీఐ) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్నిసార్లు ఈ అలవాటు మూత్రాశయం పనిచేయకపోవడానికి దారి తీస్తుంది. మూత్రాన్ని ఎక్కువ సమయం పట్టుకుని ఉండడం వల్ల న్యూరోజెనిక్ మూత్రాశయం వంటి అంతర్లీన పరిస్థితులకు దారి తీస్తుంది. ఇలా ఎక్కువ సమయం మూత్రాన్ని పట్టుకుని ఉండడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వారిలో ఈ సమస్య మరీ తీవ్రతరం అవుతుంది. మూత్రాన్ని నిలుపుకుని ఉండడం వల్ల మూత్రం గాఢత పెరుగుతుంది. తద్వారా రాళ్లు ఏర్పడే ఖనిజాల నిర్మాణం ప్రోత్సహించబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో మూత్రపిండాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
ఎక్కువ సమయం మూత్రాన్ని బిగించి పట్టుకోవడం అంత మంచిది కాదు. ఇది తీవ్రమైన మూత్రాశయ, మూత్రపిండాల సమస్యలకు దారి తీస్తుంది. కనుక మూత్రం వచ్చినప్పుడు దానిని వెంటనే విసర్జించడం మంచిది. మూత్రవిసర్జన విషయంలో మన శరీరం చెప్పినట్టు నడుచుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. మూత్రవిసర్జన సరిగ్గా చేయకపోవడం వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోయి శరీర ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కొందరు మూత్రవిసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుందని నీటిని కూడా ఎక్కువగా తాగరు. దీంతో శరీరంలో మలినాలు ఎక్కువగా పేరుకుపోయి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కనుక నీటిని ఎక్కువగా తాగడంతో పాటు సరైన సమయంలో మూత్రవిసర్జన చేయడం కూడా చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు.