చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ : రాజధానిలో పుట్టిన ఓ వార్త.. రాజ్యపు పెద్దలను భయవిహ్వలులను చేసింది. గణపతిదేవుని పెద్ద కుమారుడు.. యువరాజు రుద్రమదేవుడు ఆడామగా కానీ నపుంసకుడు!! ఆ మాట.. ఆ నోటా, ఈ నోటా రాజనగరికి చేరిపోయింది. జాయచోడుని చెవినపడింది. గణపతిదేవుడు, అక్కలు ఎలా భావిస్తున్నారోనని కించిత్ సందేహించాడు. ఈ అంశం గణపతిదేవుణ్ని చాలా ఆందోళనకు గురిచేస్తోందని జాయచోడుడు గ్రహించాడు.
యువరాజు రుద్రమదేవుడి విషయమై గణపతిదేవుడు.. వృద్ధులైన రేచర్ల రుద్రసేనాని, గంగాధర మంత్రి, మల్యాల చౌండ నివాసాలకు వెళ్లి మరీ చర్చోపచర్చలు చేస్తున్నాడు. అక్కడికి జాయచోడుణ్ని ఆహ్వానించలేదు. ఆయన కూడా అటు వెళ్లలేదు. పురనివాసంలోనే మౌనంగా ధ్యాన సమాధిలో! తన నృత్త ప్రదర్శనలో తగ్గిన తాదాత్మ్యత.. ఎందుకు? గ్రంథరచనపై దీని ప్రభావమేమిటి?!!
శుక్రను సంఘీయుల నియోగాధిపతిగా చూశాక.. చిన్ననాటి మిత్రులపై బెంగ కలిగింది. అందరినీ వెతికి పట్టుకుని కోరిన సహాయం అందించాడు. వెలనాడు నుంచి వచ్చినప్పుడల్లా కలిసి అడిగి మరీ సహాయం చేశాడు. గుండయామాత్యులు మరణించాడు. అశోకుని నేతృత్వంలో ఆ నాట్య గురుకులాన్ని బాగా అభివృద్ధి చేశాడు. అక్కడి గురువులతో మరెన్నో గురుకులాలు ఏర్పాటుచేసి కొత్త నాట్యాంశాలకు, సంగీత రాగాల కల్పనకు, వాద్యాల రూపకల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ఎప్పటికప్పుడు అవి అత్యుత్తమ కేంద్రాలుగా వెలుగొందేలా సహాయపడుతూ ప్రోత్సహిస్తున్నాడు.
అలాగే నీలాంబిక వేశ్యాగృహం లలితాంబిక నేతృత్వంలో కళకళలాడుతోంది. జాయచోడుడు రాజనగరి నివాసుడయ్యాక గణపతిదేవునికి చెప్పి నాగంభట్టు తండ్రి శివభట్టు గారికి ఘనసన్మానం చేసి.. విశాలమైన పెద్ద ఘటికాస్థానం ఏర్పరిచాడు.
సుబుద్ధి కుటుంబానికి.. ఆ వీధి, ఆ పేటలోని ప్రతివారికీ సహాయ సహకారాలు అందించాడు. సుబుద్ధి అన్నదమ్ముల పిల్లలందరూ మంచి వ్యాపారులో, ఉత్పత్తిదారులో అయ్యారు. అనుమకొండ పట్టణంలో ప్రముఖస్థానంలో ఉన్నారు. త్రిపుర పెద్ద ఎగుమతి – దిగుమతి వ్యాపారి అయ్యాడు. పెద్దపెద్ద బిడారులు నిర్వహిస్తున్నాడు. కంటక తోటి గిరిజనులతో కలిసి యుద్ధ పరికరాలకు కావాల్సిన ఇనుము తదితర లోహాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేశాడు. అతణ్ని కాకతీయ గిరిజన సైన్యానికి సైన్యాధ్యక్షుణ్ని చేశాడు జాయపుడు.
గణిక శాస్త్రవేత్త కుమారిలభట్టును కంచి ఘటికాస్థానానికి పంపాడు. రసాయన శాస్త్రవేత్త సత్యవ్రతుడికి ఔషధశాల నిర్మించడానికి సహాయపడ్డాడు. వైద్యులైన ప్రజాపతి, ప్రజ్ఞావతి ఇప్పుడు పెద్ద ప్రజా వైద్యశాల నిర్మించుకున్నారు. చిత్రకారుడు సీతాయకు రాజనగరి అలంకరణ బాధ్యతనిచ్చాడు. విక్రమ.. రాజనగరి లేఖకుడయ్యాడు. కామిశెట్టి వజ్రాలవ్యాపారిగా విదేశాలలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నకులశెట్టి వస్ర్తాల ఎగుమతి – దిగుమతిలో అనుమకొండలోనే అగ్రస్థానంలో ఉన్నాడు. నాట్యాచార్యుడు హనుమశెట్టి కొత్త గురుకులం స్థాపించాడు. బేతన రాజప్రాసాదానికి వస్తు సరఫరాదారు. చరిత్ర పరిశోధకులుగా అంకాల దక్షణావర్తపు నాట్య సంప్రదాయాలపై పరిశోధనకు, గౌరవ కాకతీయ భవిష్యత్తుపై పరిశోధనకు కావాల్సిన నిధులు ఏర్పాటుచేశాడు. రాముడు పశువుల వ్యాపారిగా క్షణం తీరికలేదు. కటారి పాదరక్షల తయారీదారు మాత్రమేకాదు.. ఇప్పుడు కొత్తకొత్త పరికరాల రూపకల్పన, తయారీ సంస్థను స్థాపించాడు. కాంతయ తోలుతో కొత్త వస్తువుల తయారీలో ప్రఖ్యాతి పొందాడు. అంతేకాదు.. వెలనాడు అనుభవాలతో ఆయా రంగాలపై పూర్తి అవగాహన కలిగిన జాయపచోడుడు.. ఆయా సామాజిక, ఆర్థిక, వ్యాపార రంగాలను కూడా సంస్కరించాడు. చలమయకు ఆర్థిక సహాయం చేస్తానన్న అహోబలపతి చిరునామా.. ఇన్నేళ్లయినా దొరకలేదు. జాయచోడుడు పెట్టుబడిదారులైన శ్రేణి వైశ్యుల ద్వారా ఆర్థిక సహకారం అందించాడు.
“నేనూ ధనసహాయం చేశాను. కానీ, అహోబలపతి కోసం చలమయ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు.. ప్చ్! ఆ బాధ పగవాడికి కూడా వద్దు మిత్రమా” అన్నాడు త్రిపుర శెట్టి.
మిత్రులంతా ఎన్నిసార్లు కాకతి గురించి అడిగినా..
“ఏమో..” అనే సమాధానమే!
“మరి పెళ్లి చేసుకోవచ్చు కదా యువరాజా!”.
“వివాహం అయిపోయిందిగా మిత్రమా! మళ్లీమళ్లీ చేసుకునేది వివాహం కాదు. కామకేళీ విలాసం. అది నాకు మెండుగా దొరుకుతోంది. పాలు దొరుకుతున్నప్పుడు ఆవును కొనమని సలహా ఇవ్వడం భావ్యమా!?”.
ఇలాంటి చర్చతో వారిని విసిగించి నోరు మూసుకునేలా చేస్తాడు. లోలోన మాత్రం..
‘కాకతీ.. నన్నేం చెయ్యమంటావు??’ అనుకుంటాడు కళ్లు మూసుకుని.
ఆమె నవ్వో.. ఏడుపో.. వినిపిస్తుంది. మంద్రంగా.. ఎక్కడో.. అంతరంగ అగాథాలలో!
గణపాంబ పెళ్లి కాదు గానీ, ‘గణపతిదేవుని వారసుడు ఎవరు?’ అనేది అనుమకొండలో ప్రధాన చర్చ అయ్యింది. ప్రజలు ఏదో అనుకుంటున్నారని అనుకున్నా.. జాయచోడుని కుతూహలం కూడా అదే! అక్క, బావగారు కూడా ఈ అంశంపై ఓ చెవి పెట్టి ఉన్నారని ఆయన భావన.
గణపతిదేవుని వారసులపై ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇప్పుడొక ఆసక్తికర అంశం.
గణపాంబ వివాహం నుంచి గణపతిదేవుని వారసులపై ప్రజల దృష్టి పడింది. అది కూడా తీవ్రంగా!
మొదటగా రుద్రమదేవుడు నపుంసకుడట!!
ఇది వెలువడగానే కార్చిచ్చులా అతివేగంగా అనుమకొండ దాటి రాజ్యమంతటా వ్యాపిస్తోంది.
సాధారణంగా ప్రజలకు రాజనగరి నుంచి వీరోచిత గాథలు, చక్రవర్తి చేసిన మహోన్నత యుద్ధాలు, శత్రువులను దునుమాడిన కథలు కావాలి. పనిపాట్లవేళ వాటికి మరింత వీరత్వం కలిపి ఆటలు, పాటలు రూపొందించి పాడుకుంటారు.. చెప్పుకొంటారు. యువరాజుగారి కుర్ర వీర, బీభత్స, శృంగారరస ప్రధాన కథలైతే మరీ ఇష్టం. అలాంటి యువరాజువారు నపుంసకుడంటే.. అంతకంటే విషాదం మరిలేదు వాళ్లకు.
ఇదేదో రుద్రమదేవుని శారీరక రుగ్మత అనుకున్నాడు కానీ, దీనిపై ఇంత రాద్ధాంతం జరుగుతుందని ఆయన ఊహించలేదు. అయితే రుద్రమదేవుడు నపుంసకుడు కాబట్టి రెండవ కొడుకు మురారిదేవుడు కాకతీయ వారసుడు కావాలి అనే మరో నినాదం వెనువెంటనే పుట్టి.. అది కూడా కార్చిచ్చు అయ్యింది. అది ప్రజల్లో వ్యాపిస్తుండగా రాజప్రాసాదంలో మరోవార్త ఆయన చెవిన పడింది.
రుద్రమదేవుడు మగవాడు కాదు.. నపుంసకుడు అసలేకాదు. ఆడపిల్ల!
జాయచోడుడు విభ్రాంతి చెందాడు. బావగారిని అడిగాడు.
“సూటిగా అడుగుతున్నాను బావగారూ! రుద్రదేవుని జన్మరహస్యం ఏమిటో.. చెప్పండి!”.
కాసేపు ఆలోచించి మెల్లగా చెప్పాడు గణపతిదేవుడు.
“ఈ గందరగోళానికి కారణం మేమే! ఒకానొక తరుణంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక మేము తీసుకున్న పిచ్చినిర్ణయం.. ఇవ్వాళ ఈ గందరగోళానికి కారణం. అందుకే చెప్తున్నా విను. రుద్రమదేవుడు నిజానికి రుద్రమ దేవి. పదహారణాల ఆడపిల్ల. మా ఖ్యాతి నిలబెట్టగల వీరయోధురాలు. ఈమె పుట్టిన సమయానికి నువ్వు రాజనగరిలో లేవు. నీకు తెలుసో లేదో.. అప్పుడు రాజ్యమంతటా గొప్ప అలజడి రేగింది. కారణం.. మాకు రెండోసారి ఆడపిల్ల పుడితే.. అంటే మా సంతానం ఇద్దరూ ఆడపిల్లలే అయితే, ఇద్దరికీ సింహాసనార్హత లేదు. అప్పుడు గణపతిదేవుడి వారసుడు ఎవరు? అనే చర్చ చాలా తీవ్రంగా జరిగి, అనుమకొండ అట్టుడికిపోయింది. ఆ సందర్భంగా మేము అత్యవసర సమావేశం నిర్వహించి పెద్దలందరి అభిప్రాయం తీసుకుని అప్పటికి.. ‘అబ్బాయే పుట్టాడు’ అని ప్రకటించడానికి అనుజ్ఞ ఇచ్చాము. నిజంగానే అప్పటికా సమస్య తొలగిపోయింది. ఎవరికీ సందేహం రాకుండా ఆమెను పసిప్రాయంలోనే త్రిపురాంతకం పంపేశాము. మేమిద్దరమే వెళ్లి చూసి వస్తుండేవాళ్లం. యుక్త వయస్కురాలైన ఆమె అక్కపెళ్లికి రావడంతో గందరగోళం ఏర్పడింది. కానీ, ఎంతకాదన్నా ఆడపిల్ల కదా! రహస్యం దాచడం కష్టమౌతోంది. వయసు వచ్చి పరిణీత అయిన యవ్వనవతిని మగపిల్లవాడిగా చూపడం చాలా కష్టం. ఆమె ఆనందాలు ఆమెకుంటాయి. మగవాడి వేషంతో ఇటు మగవాళ్లతో, అటు ఆడవాళ్లతో కలిసిమెలసి తిరగలేక.. పాపం పిచ్చిపిల్ల సతమతమైపోతోంది. దీనికితోడు ప్రజల్లో ఈ పుకార్లు.. మాటలు! ప్రజలు వేగంగా స్పందిస్తారు. రుద్రమదేవుడి మీద నమ్మకం పోగానే రెండవవాడు మురారిదేవుడి మీదికి సహజంగా వాళ్ల దృష్టిపోయింది!” దీర్ఘంగా నిట్టూర్చి..
“ఇక రహస్యం బట్టబయలు చెయ్యాల్సిన సమయం వచ్చేసింది. ప్రజలు ఎలా స్పందిస్తారో తెలియదు కానీ, ఈ రహస్యం వల్ల అనవసర రాద్ధాంతాలు జరుగుతున్నాయి. వాటికీ ముగింపు పలకాల్సింది మేమే కదా.. ఈ సమస్యను ముగిస్తాము!”..
మరునాడు ఉదయాన్నే ధార్మిక నియోగ అమాత్యుడు ధర్మనిధి లెంకను తన మనిషిగా శ్రీశైలం గోళకీమఠానికి పంపి.. విశ్వేశ్వర శంభుదేశికులను రాజనగరుకు రప్పించి.. మొదటి కొలువు సమయమంతా కూలంకషంగా శాస్త్ర చర్చలు జరిపాడు. అనంతరం ఆ ప్రకటన భాగాన్ని ఆస్థాన రాజలేఖకుడు విశ్వకర్మాచారితో రాయించి.. దానిని జాయచోడునికి చూపి.. ఆయన ‘సరే!’ అన్నాక, ప్రజావార్తసంబంధి చతుష్పథాల వద్ద ప్రకటించింది.
“జయ.. జయజయజయ.. జయ
జయ.. శ్రీశ్రీశ్రీ గణపతిదేవులవారికి.. జయ
జయ.. కాకతీయ సామ్రాజ్యానికి.. జయ
పురవాసులకు, సమస్త కాకతీయ రాజ్య ప్రజలకు, సామంతరాజ్యాల ప్రజలకు శుభవార్త! ప్రకటిస్తున్నవారు అనుమకొండ నగర దండనాయకులు శ్రీ అంకయ చమూపతి.
గతంలో మన్మహామండలేశ్వరుల వారికి రెండవ సంతానం కలిగిన వేళావిశేషాలను బట్టి, పుట్టిన నక్షత్ర రాశులను బట్టి, ఆ ముహూర్తం నాటి రాహుకేతుగ్రహాల ప్రభావాన్నిబట్టి పుత్రుడు జన్మించినట్లుగా ప్రకటించడం జరిగింది. ఆ చెడుగ్రహాల ప్రభావం ఇప్పుడు తొలగిపోయినట్లుగా ఆస్థాన పురోహితులు, గురువులు, శైవ స్వరూపులు శ్రీశ్రీ విశ్వేశ్వర శంభుదేశికులు తెలియజేసిన దరిమిలా.. ఆ రెండవ సంతానం పుత్రిక అని తెలియజేయడమైనది. ఆ చిరంజీవి లక్ష్మీసౌభాగ్యవతి నామధేయం రుద్రమదేవి. కావున తెలియజేయడమైనది.
జయ.. కాకతీయ సామ్రాజ్యానికి.. జయ”..
చెప్పాలనుకున్నది చెప్పేశాడు గణపతిదేవుడు. ప్రజల భావనలు ఎలా ఉన్నయో చెప్పాల్సింది శుక్ర. అతడు అందించబోయే ప్రజావాణి కోసం రాజమందిరంలో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
“అబ్బాయి అయితే ఇద్దరు కొడుకులలో ఎవరు వారసుడు అనే సమస్య వస్తుంది కానీ, అబ్బాయి కాదు.. అమ్మాయి అంటే మాకేమిటి నష్టం! గణపాంబ లాగే రుద్రాంబకు కూడా వివాహం చేస్తారు. మెట్టినింటికి వెళ్లిపోతుంది. ఇప్పుడు ఒక్కడే కొడుకు. అతడే కాకతీయ సింహాసన వారసుడు.. మురారిదేవుడు!”..
ఇది శుక్ర నివేదికలో ప్రధానాంశం..
మరునాటి ప్రత్యూషవేళ కాలకృత్యాలు తీర్చుకుని కాసే బిగించి కట్టి వ్యాయామశాలకు వెళ్లాడు జాయపుడు. ఆశ్చర్యం!
అక్కడ గణపతిదేవుడు మరొకరితో కుస్తీపట్లు పోటాపోటీగా పడుతున్నాడు. ఆ వ్యక్తికున్న కేశాలంకరణ వల్ల మహిళ అని తెలుస్తోంది.
దగ్గరికి వెళితే అబ్బురంగా.. అతడు.. కాదు కాదు ఆమె! రుద్రమదేవి!!
“రా జాయా! రా రా.. సూర్యోదయాత్పూర్వమే వీరుడు నిద్రలేవాలి. మాబోటి మహామండలీశ్వరులు చూశావా! ప్రత్యూషవేళకు ముందే వ్యాయామశాలకు వస్తున్నారు. ఈరోజు తమరే ఆలస్యం. ఇదిగో ఈ అబ్బాయిని తేరపార చూడు. ఎవరో గుర్తించావా.. కాకతీయ కొదమసింహం.. మా ద్వితీయ కుమార్తె రుద్రమదేవి! నువ్వన్నట్లు ఇంతకాలం మగాడని చెప్పడం మా తప్పు. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. అన్ని యుద్ధవిద్యల్లోనూ ఆరితేరింది. ప్రస్తుత మన రాజ్యంలో, మన సామంతరాజ్యాలలో రుద్రమతో సరిరాగల మహిళలే కాదు.. సరిరాగల మగాడు కూడా లేడని తనే నిరూపించుకుంటుంది!”.
కూతురి యుద్ధవిద్యా ప్రావీణ్యం చూసి.. కూతురు గురించి కొండంత తృప్తితో చెప్పాడు గణపతిదేవుడు.
జాయచోడుడు విభ్రమంగా చూస్తున్నాడామెను.. కాకతీయ సామ్రాజ్య భవిష్యత్ స్వరూపాన్ని!!
(సశేషం)
మత్తి భానుమూర్తి
99893 71284