తొర్రూరు, నవంబర్ 5: రైతులు మూడేండ్లు కష్టపడి ఆయిల్‌పామ్ సాగు చేస్తే 30 ఏండ్లపాటు స్థిరమైన ఆదాయం లభిస్తుందని జాతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాధుర్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెంలో ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య పామాయిల్ క్షేత్రంలో శుక్రవారం పంట సాగు, యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధుర్ మాట్లాడుతూ.. పామాయిల్ దిగుమతుల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూనె గింజల సాగును ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత మహబూబాబాద్‌లోనే అధికంగా ఆయిల్ పామ్ పంట సాగు అవుతుందన్నారు. ఒక్కో మొక్కకు రూ.33 సబ్సిడీ ఇస్తుందని, సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తామన్నారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి సాధించవచ్చని, టన్నుకు రూ.19,800 ఆదాయం వస్తుందని తెలిపారు. మూడేండ్లపాటు పంటను కాపాడితే దాదాపు 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు.