Bandi Bhageerath | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): పొక్సో కేసులో నిందితునిగా ఉండి, తొమ్మిది రోజులపాటు పరారీలో ఉన్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల అదుపులోకి చేరుకున్నాడు. అయితే భగీరథ్ స్వయంగా లొంగిపోయాడా లేక పోలీసులు అరెస్టు చేశారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. చట్టాలపై ఉన్న గౌరవంతో తానే స్వయంగా తన కుమారుడిని ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు అప్పచెప్పినట్టు భగీరథ్ తండ్రి బండి సంజయ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
మరో పక్క నార్సింగిలోని అప్పా జంక్షన్ వద్ద తమ సిబ్బంది భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్ వెల్లడించడం అయోమయానికి గురిచేసింది. బాలికపై లైంగికదాడి కేసులో పోక్సో చట్టాలను ఎదుర్కొంటున్న భగీరథ్ ఈనెల 13న పోలీసు విచారణకు హాజరుకాకపోవడంతో మొదలైన హైడ్రామా రోజుకో కొత్త మలుపు తిరిగింది.
పోలీసుల విచారణకు హాజరుకాని భగీరథ్ తనకు రెండు రోజుల సమయం కోరుతూ పోలీసులకు మెయిల్ పంపడం, అంతలోనే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం, మరోవైపు బాధితురాలు మైనరే కాదు అంటూ పలు రకాల అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ కేసు తొలి రోజు నుంచే పూర్తి అయోమయంగా మారింది. తీరా బాధితురాలు మైనరేనని నిర్ధారించిన పోలీసులు విషయాన్ని కోర్టుకు విన్నవించడంతో నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.
దీంతో సైబరాబాద్ పోలీసులు శనివారం భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీచేయడంతో పాటు బంజారాహిల్స్, కరీంనగర్‌లోని అతడి నివాసాలలో సోదాలు చేయడంతో ఇక అరెస్టు తప్పదనే వాదనలు వినిపించాయి. ఇంతలో నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పేట్‌బషీరాబాద్ పోలీసుస్టేషన్‌తోపాటు మేడ్చల్ కోర్టు, స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోలీసు బలగాలను మోహరించడంతో నిందితుడు లొంగిపోతున్నట్టు అందరూ భావించారు.
మధ్యాహ్నమే నిందితుడు పోలీసులకు లొంగిపోయాడని కొందరు, లేదు అంతకన్నా ముందే పోలీసుల అదుపులో ఉన్నట్టు మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. నిందితుడిని ఉదయమే అదుపులోకి తీసుకున్నప్పటికీ పగటివేళ అరెస్టు చూపిస్తే మహిళా సంఘాలు, ప్రతిపక్షాల నుంచి నిరసనసెగ తప్పదని భావించిన పోలీసులు పొద్దుపోయాక విషయాన్ని బయటకు లీక్ చేశారనే వాదనలు కూడా వినిపించాయి. పోక్సోలో నిందితునిగా ఉన్న తన కుమారుడిని ఇంతకాలం దాచిపెట్టాడన్న అపవాదు నుంచి బయటపడటానికే బండి సంజయ్ తానే అప్పగించినట్టు ప్రకటన విడుదల చేశారని కొందరు భావిస్తుండగా.. నిందితుడు లొంగిపోయాడని అంగీకరిస్తే.. ఇంతకాలం అతడిని అరెస్టు చేయలేకపోయిన తమ అసమర్థతపై విమర్శలు వస్తాయన్న భావనతోనే పోలీసులు తామే అరెస్టు చేశామని ప్రకటించారన్న వాదన మరో వైపు వినిపిస్తున్నది.