హైడ్రా అధికారులు తమను ప్రభుత్వ యంత్రాంగానికి అతీతమైన ప్రత్యేక వ్యవస్థగా భావించరాదని హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. హైడ్రా ‘సూపర్ కాప్’ కాదని, చట్టం కల్పించిన అధికారాల పరిధిలోనే పనిచేయాలని స్పష్టంచేసింది. కోర్టుకు ప్రభుత్వం తరఫున ఇచ్చే హామీలు అన్ని శాఖలకు సమానంగా వర్తిస్తాయని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని పేరొంది. ఆ హామీలను ఉల్లంఘిస్తే కోర్టు ధికరణ చర్యలు ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : అన్ని న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చి ఓ ఆస్తి ప్రైవేట్‌దేనని తేల్చినప్పటికీ హైడ్రా అక్కడ జోక్యం చేసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబోమని గతంలో హామీ ఇచ్చినా అందుకు విరుద్ధంగా హైడ్రా వ్యవహరించడం కోర్టు ధికరణేనని, దీన్ని చట్టం అనుమతించబోదని స్పష్టంచేసింది. కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఇకపై అత్యుత్సాహంతో ప్రైవేట్ ఆస్తుల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. విధుల నిర్వహణలో హైడ్రా ‘సూపర్ కాప్’ ఏమీ కాదని, దానికి ప్రత్యేకాధికారాలు లేవని, చట్టపరిధిలోనే పనిచేయాలని హెచ్చరించింది. గతంలో రిట్ పిటిషన్లు, రెండు కోర్టు ధికరణ పిటిషన్లలో విచారణ సందర్భంగా.. ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోబోమంటూ ఇచ్చిన హామీకి విరుద్ధంగా వ్యవహరించినందుకుగాను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కోర్టు ధికరణ కింద శిక్షించాలని కోరుతూ శాంతాశ్రీరాం కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మలాజిగిరి మండలంలోని లోతుకుంట భూములు ప్రైవేట్వని సివిల్ కోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు.
ఈ ఉత్తర్వులను హైకోర్టు ధ్రువీకరించిందని చెప్పారు. అయినా హైడ్రా తమ ఆస్తిలో జోక్యం చేసుకుంటున్నదని పేర్కొన్నారు. గతంలో దీనిపై హైకోర్టును ఆశ్రయించగా.. ఇకపై జోక్యం చేసుకోబోమని ప్రభుత్వ ప్రత్యేకన్యాయవాది హామీ ఇచ్చిన నేపథ్యంలో ధికరణ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని గుర్తుచేశారు. అయినప్పటికీ హైడ్రా మళ్లీ జోక్యం చేసుకుంటున్నదని తెలిపారు. హైడ్రా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సొసైటీ టు సేవ్ రాక్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు హైడ్రాకు రాసిన లేఖ నేపథ్యంలో సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలతోపాటు రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి కోర్టులన్నీ ప్రైవేట్ వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినపుడు ఆ ఆస్తిపై ప్రభుత్వం హకులు కోరడానికి వీల్లేదని అన్నారు. అలాంటి చర్య ఏది చేపట్టినా.. హైకోర్టుకు ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టేనని స్పష్టంచేశారు. హైడ్రా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమేనని, ప్రభుత్వం ఇచ్చిన హామీని హైడ్రా ఉల్లంఘిస్తే కోర్టు ధికరణ చర్యలు తీసుకోవడానికి ఈ కోర్టు ఉపేక్షించబోదని హెచ్చరించారు. హైడ్రా జీహెచ్ఎంసీ చట్టం కింద ఏర్పాటైందని పేరొన్నారు. జీవో 191లో పేరొన్న పరిధిని హైడ్రా అతిక్రమించడానికి వీల్లేదని చెప్పారు. గత పిటిషన్ లో హైడ్రా ప్రతివాదిగా లేదన్న కారణంగా స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన వినతిపత్రం ఆధారంగా ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకొనే హకు దానికి లేదని స్పష్టం చేశారు.
ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవాలన్న అనాలోచిత చర్యలకు పూనుకోవద్దని న్యాయమూర్తి హైడ్రాను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విధులు నిర్వహించడానికి ఉత్సాహం చూపవచ్చని అయితే హైడ్రా చర్యలు చట్టపరిధికి లోబడే ఉండాలని స్పష్టంచేశారు. చట్టపరిధిని దాటి వ్యవహరిస్తే న్యాయస్థానాల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. పిటిషనర్‌కు చెందిన వ్యవహారంలో హైడ్రా చర్య చట్టవిరుద్ధమని, సమర్థనీయం కాదని తప్పుబట్టారు. ఇకపై హైడ్రా అధికారులు పిటిషనర్ ఆస్తి జోలికి వెళ్లరని హామీ ఇవ్వడంతో ఇకపై దీనికి కట్టుబడి ఉండాల్సిందేనని పేరొన్నారు. అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ కార్యాలయం, ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఎవరైనా కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వ అధికారులు పాటిస్తారని హామీ ఇస్తే.. అది ప్రతి శాఖకూ వర్తిస్తుందని స్పష్టంచేశారు. ఒకవేళ ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే అధికారులను వేలెత్తి చూపాల్సి వస్తుందని, ఈ చర్యను కోర్టు ధికరణ కింద పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నది సుస్థిరమైన న్యాయసూత్రమని పేరొన్నారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చిన హామీ నేపథ్యంలో ఇకపై పిటిషనర్ ఆస్తిలో హైడ్రా జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. కోర్టు ధికరణ పిటిషన్లపై విచారణను మూసివేశారు.
‘హైడ్రా తనకు తాను ప్రత్యేకమైన లేదంటే ఉన్నతమైనదిగా భావిస్తున్నట్టున్నది. కానీ అది కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే. జీహెచ్ఎంసీ చట్ట పరిధిలో హైడ్రా ఏర్పాటైంది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేస్తూ జారీచేసిన నోటిఫికేషన్లో పేరొన్న పరిధిని అది అతిక్రమించరాదు. హైడ్రా విధుల నిర్వహణలో సూపర్ కాప్స్ (అతీతమైన అధికారాలు గలది) ఏమీకాదు. చట్టపరిధిని దాటి వ్యవహరించే అధికారం హైడ్రాకు లేదు’