అమరావతి : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పరకామణి చోరీ ( Parakamani theft ) కేసు అంశంపై ఏపీ హైకోర్టు ( High Court ) సీరియస్ అయ్యింది. ఈనెల 27 న టీటీడీ ఈవో ( TTD EO ) కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. వైసీపీ హయాంలో జరిగిన టీటీడీ పరకామణి చోరీ కేసుపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక నివేదికను హైకోర్టుకు సమర్పించారు.
అయితే ఘటనపై ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. ఈనెల 27న టీటీడీ ఈవో కోర్టు ముందు హాజరుకావాలని , లేనిపక్షంలో రూ. 20 వేలు జరిమానా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై కౌంటర్ దాఖలు చేసేందుకు టీటీడీ అధికారులు సమయం కోరగా ఈనెల 27కు విచారణ వాయిదా వేసింది.
రవికుమార్ అనే ఉద్యోగి పెద్ద ఎత్తున పరకామణిని కొల్లగొట్టారని 2023లో ఫిర్యాదులు వెళ్లాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపకుండానే అప్పటి టీటీడీ అధికారులు లోకాయుక్తతో రాజీ చేయించారు. ప్రస్తుతం తాజాగా పరకామణిలో చోరీ వ్యవహారంపై శ్రీనివాసులు అనే వ్యక్తి పిటిషన్ వేయడంతో ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణిలో దస్త్రాలను సీఐడీ అధికారులు సీజ్ చేశారు.