హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): జైళ్లశాఖలోని డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారుల్లో పురుషులకు మాత్రమే పదోన్నతి కల్పించాలన్న నిబంధనల జీవోను హైకోర్టు కొట్టేసింది. మహిళా అధికారులకు పదోన్నతులు కల్పించాలని ఈ జీవోలో లేకపోవడం వివక్ష కిందకే వస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు 1996 ఆగస్టు 17న హోంశాఖ జారీచేసిన 316 నంబర్ జీవోను కొట్టేస్తున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. పదోన్నతుల్లో వివక్షపై న్యాయపోరాటం చేసిన డిప్యూటీ సూపరింటెండెంట్ టీ వెంకటలక్ష్మి శ్రీనాథ్‌కు సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించాలని హోంశాఖను ఆదేశించింది.