యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 29: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపైన, పాతగుట్టలో భక్తులు సమర్పించే ‘మొక్కు వస్ర్తాల’ సేకరణ టెండర్ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ కేసుకు సంబంధించిన దేవాదాయశాఖ కమిషనర్ స్వయంగా ఒరిజినల్ రికార్డులతో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇచ్చిన లేఖతో ‘మొక్కువస్ర్తాల టెండర్’ కాలాన్ని ఎలా పొడిగిస్తారంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయం స్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన వ్యాపారి అన్నల్దాస్ వెంకటేశ్ హైకోర్టులో దాఖాలు చేసిన రిట్ పిటిషన్‌ను గత బుధవారం విచారించిన హైకోర్టు ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీచేసింది. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా గుడువు తీరకుండానే ఎమ్మెల్యే లేఖతోపాటు సదరు కాంట్రాక్టు ఇచ్చిన విజ్ఞప్తి ఆధారంగా మూడేండ్లకు లీజును పొడిగిస్తారా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది.
యాదగిరిగుట్ట దేవస్థానంలో 2025 ఏప్రిల్ 1 నుంచి 31, మార్చి 2026 వరకు వస్ర్తాల సేకరణకు వేలం నిర్వహించగా నాగరాజు అనే వ్యక్తి అధిక బిడ్డర్‌గా నిలిచారు. టెండర్ గడువు ముగియక ముందే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం 28, ఆగస్టు 2025న లీజు కాలాన్ని మూడేండ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఇచ్చిన లేఖ, సదరు కాంట్రాక్టర్ ఇచ్చిన విజ్ఞప్తి ఆధారంగా టెండర్ కాలాన్ని పొడిగించడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ‘టెండర్ నిబంధనలకు విరుద్ధంగా, గడువు తీరకుండానే ఎమ్మెల్యే లేఖ ఆధారంగా మూడేండ్ల లీజు పొడిగించడం ఏ రకమైన న్యాయమంటూ ప్రశ్నించింది. ఇది చట్ట సూత్రాలకు వ్యతిరేకమని ఆక్షేపించింది.
లీజు పొడిగింపు ఉత్తర్వులను ప్రస్తుతం నిలిపివేతలో ఉంచామని ప్రభుత్వలాయర్ తెలిపినప్పటికీ ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించలేపోయారని ఆగ్రహించింది. కమిషనర్ అందుబాటులో లేరని చెప్పడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ తరహా నిర్ణయాలు చట్టవిరుద్ధమని పేర్కొన్న హైకోర్టు, దేవాదాయశాఖ కమిషనర్ తదుపరి విచారణ సమయానికి కేసుకు సంబంధించిన పూర్తి ఒరిజినల్ రికార్డులతో స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వు ఏ ప్రాతిపదికన ఇచ్చారు.. ఇప్పటివరకు ఎందుకు ఉపసంహరించుకోలేదు అనే అంశంపై కమిషనర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.