పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమల తరలింపు ఇప్పటికిప్పుడు జరిగిపోదు. అన్ని పరిశ్రమలను తరలించేవరకు ల్యాండ్ కన్వర్షన్ జరగదు. ఈ మేరకు 2013లో వెలువడిన జీవో 20ని కచ్చితంగా అమలు చేస్తాం. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను సవరించి ముందుకెళ్తాం.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్‌గా మీరిచ్చిన హామీలను నమోదు చేసుకున్నం. దీనికి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయండి.
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27ను హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలన్న అంశం ఈ జీవోలో ఎక్కడ ఉన్నదని ప్రశ్నించింది. జీవోలోని అంశాలను ప్రాథమికంగా పరిశీలిస్తే.. పారిశ్రామిక భూములను ఎవరైనా వచ్చి కొనుగోలు చేసేందుకు అవకాశముందని వ్యాఖ్యానించింది. ఇది తప్ప ప్రస్తుత పరిశ్రమలకు ప్రత్యామ్నాయం చూపే వివరాలు కనిపించడం లేదని ఆక్షేపించింది. హిల్ట్ పాలసీ కోసం గత నెల 22న ప్రభుత్వం జారీ చేసిన జీవో 27ను సవాల్ చేస్తూ ప్రొఫెసర్ కే పురుషోత్తంరెడ్డి, జీవో జారీ వెనుక ఉన్న కుట్ర కోణాన్ని తేల్చేందుకు ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తునకు ఆదేశించాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పీ శ్యాం కోశీ, జస్టిస్ ఎస్ చలపతిరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జీవోలోని అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ, కాలుష్య తీవ్రతలో హైదరాబాద్ ఆరెంజ్ జోన్లో ఉందని చెప్పారు గ్రీన్ హైదరాబాద్ ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం పారిశ్రామిక విధానం తీసుకొచ్చామని, ఇప్పటికిప్పుడు పరిశ్రమల తరలింపు జరిగిపోదని తెలిపారు. హిల్ట్ పాలసీని 2013లో వెలువడిన జీవో 20లోని నిబంధనలకు అనుగుణంగానే అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. భూమార్పిడిలో హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేస్తుందని స్పష్టంచేసింది. పరిశ్రమల తరలింపు, కొత్తవాటి ఏర్పాటులో సమయం పడుతుందన్న ఏజీ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం మధ్యంతర ఆదేశాలు అవసరం లేదని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది.
తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కే వివేక్‌రెడ్డి, కే ప్రతీక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను సవరించకుండా పారిశ్రామిక భూములను వినియోగించే విధానాన్ని (ల్యాండ్ యూజ్) మార్చే హకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. చట్టాలకు విరుద్ధంగా హిల్ట్ పాలసీ జీవో ఉందని తెలిపారు. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఈఐఏ) చేయకుండానే వేలాది ఎకరాల్లోని పారిశ్రామిక భూములను నివాస స్థలాలుగా మార్పు చేయడం దారుణమని అన్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. 2006 ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం పారిశ్రామిక భూము లు 9292.53 ఎకరాలను రెసిడెన్షియల్ ప్రాజెక్టుల కోసం వినియోగించాలంటే ముందుగానే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు పొందాలని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జీవో జారీ చేసిందని తెలిపారు. అత్యంత విలువైన భూములను కేవలం 30 శాతం విలువకే కట్టబట్టే ప్రయత్నాలు అడ్డుకోవాలని కోరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా జారీచేసిన జీవో వల్ల పారిశ్రామికవాడలు రెసిడెన్షియల్ జోన్లుగా మారితే.. హానికారక రసాయన ప్రభావం ఉండే ప్రాంతాల్లో ప్రజలు జీవించి అనేక రోగాలబారిన పడతారని ఆందోళన వెలిబుచ్చారు. హ్రెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ను సవరించాలంటే ప్రభుత్వం నోటిఫై చేసి అభ్యంతరాలు స్వీకరించాలని చెప్పారు. హెచ్ఎండీఏ జీవో ప్రకారం సదరు భూముల్లో ఉన్న అన్ని పరిశ్రమలను బయటికి తరలించిన తర్వాతే ఆ భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చునని చెప్పారు. ఎవరు డబ్బు కడితే వాళ్లకి ఇప్పుడున్న పారిశ్రామిక భూములను రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్లుగా మార్చుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు.
‘జీవో 27 పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగ నిబంధనలకు విఘాతం. జీవో 27 అమల్లోకి వస్తే ప్రజా ప్రయోజనాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ప్రజారోగ్యం దెబ్బతింటుంది. తక్షణమే జీవో 27 అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీచేయాలి. తక్షణమే కోర్టు జోక్యం చేసుకోవాలి. జ్రీవో జారీకి ముందుకు ప్రభుత్వం అంతర్గత సమీక్ష, శాఖాపరమైన పరిశీలన, సమగ్ర కార్యాచరణ నివేదికలతో పనిలేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. జీవోను అమలుచేస్తే ఆర్థికంగా తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాబట్టి తక్షణమే జీవో 27 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’ అని ఒక పిటిషన్లో పేరొన్నారు. ‘ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయకుండా ఏకపక్షంగా జీవో 27 జారీచేసింది. జీవో ప్రకారం పారిశ్రామిక భూముల్లో నివాసానికి వీలుగా అపార్ట్మెంట్స్, టౌన్‌షిప్‌లు, ఆఫీసులకు, హోటల్స్, పారులు, స్పోర్ట్స్ సౌకర్యాలు, కల్చరల్ సెంటర్స్, ఐటీ పారులు, ఐపీ క్యాంపస్‌లు వంటివి ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ జీవో అమల్లోకి వస్తే గాలి, నీరు మరింత కలుషితమవుతాయి’ అని మరో పిల్లో విజ్ఞప్తిచేశారు.
పిటిషనర్ల వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ.. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తరలింపు ఇప్పటికిప్పుడు జరిగిపోదని చెప్పారు. పరిశ్రమలన్నింటినీ తరలించే వరకు ఏవిధమైన ల్యాండ్ కన్వర్షన్ జరగదని హామీ ఇచ్చారు. పరిశ్రమలను తరలించడమే ప్రభుత్వ విధానమని చెప్తూనే.. పరిశ్రమల తరలింపునకు ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయబోమని చెప్పారు. ఈ మేరకు 2013లో వెలువడిన జీవో 20ని కచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను సవరించి ముందుకు వెళతామని తెలిపారు. ఈ హామీలను ధర్మాసనం నమోదు చేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధి నుంచి కాలుష్యకారక పరిశ్రమల తరలింపునకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఏజీ చెప్పారు. జీవో 20కి అనుగుణంగా చర్యలు ఉంటాయని, ఈ క్రమంలోనే జీవో 27 జారీ చేశామని చెప్పారు. పిటిషనర్లు ఆందోళనకు కారణాలు ఏమీ లేవన్నారు. నివాస ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నందున జీవో 27 జారీ చేసినట్టు చెప్పారు. ఎంసీ మెహతా కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని తెలిపారు. దీని ప్రకారం నివాస ప్రాంతాల్లో పరిశ్రమలు లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ మరో ఢిల్లీ కాకుండా చేయాలన్నదే ధ్యేయమని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీకి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 9292.53 ఎకరాల పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కౌంటర్లు దాఖలు తర్వాత తగిన ఉత్తర్వులను జారీ చేస్తామని ప్రకటించింది. అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర పారిశ్రామికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టీజీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర కుటుంబ సంక్షేమ, వైద్య శాఖల కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.