
లూధియానా, డిసెంబర్ 23: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్‌లో అలజడి రేగుతున్నది. అమృత్సర్, కపుర్తలాలో సిక్కు మత సంప్రదాయాలను అవమానించడం, మూకదాడుల్లో ఇద్దరి హత్యలు మరువక ముందే లూధియానాలో ఓ బాంబు పేలింది. జిల్లా కోర్టు కాంప్లెక్సులో జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఐదుగురు గాయపడ్డారు. కాంప్లెక్స్‌లోని బాత్రూంలో ఈ పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
ఈ ఘటనను పంజాబ్ సీఎం చన్నీ ఖండించారు. ఎన్నికల వేళ అల్లర్లు సృష్టించడానికి దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ ఘటనపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దర్యాప్తును పర్యవేక్షించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్ రవి శంకర్ ఝాను కోరారు.