జెరూసలేం: వరుస వైమానిక దాడులతో హెజ్బొల్లా కీలక అధికారులను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెడుతున్నది. శుక్రవారం దక్షిణ లెబానాన్‌పై జరిపిన వైమానిక బాంబు దాడిలో హెజ్బొల్లా మిస్సైల్ యూనిట్ నాయకుడు, సీనియర్ కమాండర్ అరెబ్ ఎల్ షోగా హతమైనట్టు తెలిసింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా మిస్సైల్ దాడుల వెనుక షోగా ఉన్నట్టు ఐడీఎఫ్ భావిస్తున్నది. మరోవైపు సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 22 మంది చనిపోయారని, మరో 117 మంది తీవ్రంగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. హెజ్బొల్లా సీనియర్ అధికారి వఫిక్ సఫాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించిందని సమాచారం.
ఇజ్రాయెల్ తీరును ఖండించిన ప్రపంచ దేశాలుదక్షిణ లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంపైనా ఇజ్రాయెల్ సైన్యం గురువారం దాడులకు దిగింది. నకోరాలోని తమ హెడ్‌క్వార్టర్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసిందని, వాహనాలు, సమాచార వ్యవస్థ ధ్వంసమైందని ఐరాస శాంతి పరిరక్షణ దళం ‘యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్’ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఐరాస సిబ్బంది తీవ్రంగా గాయపడినట్టు పేర్కొన్నది. దీంతో ఇజ్రాయెల్ తీరును భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయి. శాంతి పరిరక్షణ దళాల్లో భారత సైన్యం విధులు నిర్వర్తిస్తున్నది.
ఇజ్రాయెల్ ఏజెంట్‌గా మారిన ఇరాన్ టాప్ కమాండర్!
ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖానీ ఇజ్రాయెల్‌కు ఏజెంట్‌కు మారాడని చెప్తూ అతడితో పాటు మరికొంత మందిని ఇరాన్ దళాలు బంధించాయి. ఇరాన్ దళాలు ఇంటరాగేషన్ చేస్తుండగా, అతడికి గుండెపోటు వచ్చిందని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. ఖానీ ఇటీవల హెజ్బోల్లా చీఫ్, డిప్యూటీ, ఆపరేషన్ చీఫ్‌లతో భేటి అయ్యాడని… ఆ తర్వాత వారిపై ఇజ్రాయెల్ దాడి చేసినట్టు అల్ హదిత్ ఛానల్ కథనం పేర్కొన్నది.