బీరూట్: లెబనాన్ సాయుధ గ్రూప్ హెజ్బొల్లా మంగళవారం డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై విరుచుకుపడింది. అయితే గత వారం తమ టాప్ కమాండర్‌ను హత్య చేసినందుకు ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదని ఆ సంస్థ వెల్లడించింది. లెబనాన్ దాడి వల్ల నహరియా నగరంలో పలువురు పౌరులు గాయపడ్డారని ఇజ్రాయెల్ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని రెండు హెజ్బొల్లా స్థావరాలపై తమ వైమానిక దళం దాడి చేసిందని చెప్పింది. మరోవైపు లెబనాన్‌లోని మెఫడౌన్ పట్టణంపై జరిగిన దాడిలో నలుగురు చనిపోయారని భద్రతా వర్గాలు తెలిపాయి. చనిపోయినవారిని హెజ్బొల్లా ఫైటర్లుగా భావిస్తున్నారు.
బీరుట్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల గర్జన
బీరుట్: ఇజ్రాయెల్ యద్ధ విమానాలు మంగళవారం లెబనాన్ రాజధాని బీరుట్ మీదుగా దూసుకెళ్లాయి. లెబనాన్ హెజ్బొల్లా హెడ్ కీలక ప్రసంగం కోసం దేశ ప్రజలంతా టీవీల ముందు ఎదురుచూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో లెబనాన్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. నగరంలోని ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. యుద్ధ విమానాలు మూడుమార్లు బీరుట్ మీదుగా వెళ్లాయి.
హమాస్ కొత్త చీఫ్ యాహ్యా సిన్వార్
గాజా, ఆగస్టు 6: గాజాస్ట్రీప్ చీఫ్ యాహ్యా సిన్వార్ హమాస్ కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు. తమ ఉద్యమానికి సంబంధించి రాజకీయ బ్యూరో అధిపతిగా యాహ్యా సిన్వార్‌ను ఎంపిక చేసినట్టు ద ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ హమాస్’ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హమాస్ కొత్త చీఫ్ ఎంపిక జరిగిన కొద్ది నిమిషాల్లోనే హమాస్ సాయుధ బలగం ‘ఎజ్జెడైన్ అల్ కస్సమ్’ బ్రిగేడ్స్ ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించింది. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్ నిఘా ఏజెంట్స్ దాడిలో హమాస్ చీఫ్ హానియా హతమైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, లెబనాన్‌లోని హెజ్బొల్లా ప్రకటించటంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.