‘మంచివాళ్లకు అతడు హీరో. చెడ్డవారి పాలిట విలన్. తనకు జరిగిన అన్యాయంపై అతడు శత్రువులతో ఎలాంటి పోరాటం చేశాడో తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే’ అంటున్నారు శ్రీరామ్ ఆదిత్య. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హీరో’. సీనియర్ కథానాయకుడు కృష్ణ మనవడు అశోక్ గల్లా ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. 2022 జనవరి 26న సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అంశాల కలబోతగా రూపొందుతున్న చిత్రమిది. అశోక్ గల్లా పాత్ర శక్తివంతంగా ఉంటుంది. ఇటీవల విడుదలచేసిన టీజర్‌తో పాటు ‘తెలుగందమే’ పాటకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని తెలిపారు. జగపతిబాబు, నరేష్, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ప్రసాద్.