హీరోయిన్గా ఇంద్రజ అందరికి సుపరిచితురాలు.. పలు చిత్రాల్లో హీరోయిన్గా చేసిన ఇంద్రజ ఇప్పుడు కొన్ని చిత్రాల్లో తల్లి పాత్రలు, వదిన పాత్రల్లో కనిపిస్తున్నారు. దీంతో పాటు బుల్లితెరపై పలు షోస్‌లో జడ్జిగా, యాంకర్‌గా కూడా ఆమె చేస్తున్నారు. ఇటీవల ఆమె నటించిన చిత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం. రావు రమేష్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆమె రావురమేష్‌కు జోడిగా కనిపించారు. అంకిత్కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్యపాత్రల్లో నటించిన ఈచిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకుడు.
పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పణలో రిలీజైన ఈ చిత్రం పర్వాలేదనిపించుకుంది. అయితే ఈ సినిమా ఈవెంట్స్‌లో పాల్గొన్న ఇంద్రజ చేసిన పలు వివాదస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో ఆమె మాట్లాడుతూ ”షూటింగ్ లోకేషన్స్‌తో పాటు.. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో అవాంతరాలు సృష్టిస్తూ.. పర్ఫార్మ్ చేయకుండా.. షూటింగ్ లోకేషన్లో అన్ఈజీ వాతావరణం క్రియేట్ చేసే మనుషుల మధ్య రావు రమేష్ గారితో ఈ సినిమాలో నటించడం ఎంతో కంఫర్ట్‌గా అనిపించింది’ అంటూ ఆమె చేసిన కామెంట్స్‌పై సినీ పరిశ్రమలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంద్రజను అంతగా ఇబ్బంది పెట్టిన ఆర్టిస్ట్ ఎవరుంటారబ్బా అంటూ అందరూ ఆలోచిస్తున్నారు.
అంతేకాదు ఇటీవల జరిగిన మారుతి నగర్ సుబ్రమణ్యం థ్యాంక్స్ మీట్లో ఆమె మాట్లాడుతూ మరో సారి హాట్‌కామెంట్స్ చేశారు ‘సినీ పరిశ్రమలో మేల్ పాత్రలకు లభించిన ప్రాధాన్యత పాత్రలు, నటనకు స్కోప్ వున్న పాత్రలు, మహిళలకు లభించడం లేదు. సినీ పరిశ్రమలోని మహిళల అందరి తరపున నేను మాట్లాడుతున్నాను మాకున్న అతి తక్కువ స్కోప్‌లోనే మమ్ములను మేము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మా ఫీమేల్ ఆర్టిస్ట్‌ల్లో కూడా సత్తా వుంది. మాకు శక్తివంతమైన పాత్రలు రాయండి. నటించడానకి స్కోప్‌ను పెంచండి.. ఇది రచయితలకు, దర్శకులకు నా మనవి’ అన్నారు. ఇక మారుతి నగర్ సుబ్రమణ్యంలో నా పాత్ర గురించి లక్ష్మణ్ చెప్పగానే ఇలాంటి పాత్రను మిస్ అవ్వొద్దని ఆ రోజే డిసైడ్ అయ్యానని, ఈ రోజు నా పాత్రకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో సంతోషంగా వుందని ఆమె తెలిపారు.