`ప్రముఖ వ్యాఖ్యాత, టెలివిజన్ ప్రయోక్త సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌కుమార్ కలివరపు దర్శకుడు. బలగ ప్రకాష్ నిర్మాత. మే 6న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం అగ్ర హీరో పవన్‌కల్యాణ్ విడుదల చేశారు. పల్లెటూరిలో ఉండే జయమ్మ తన సమస్య పరిష్కారం కోసం పంచాయితీకి హాజరు కావడం, గ్రామ పెద్దలు ఆమెను తేలికగా తీసుకోవడం..ఈ క్రమంలో జయమ్మ అనుభవించే సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఉత్తరాంధ్ర మాండలికంలోని సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఎవరు వల్ల సెడ్డావురా వీరన్న అంటే నోటి వల్ల సెడ్డానురా కాటమరాజా’ అనే సంభాషణ నవ్వుల్ని పూయించింది. ‘సుట్టాలు లేరు..ఊళ్లో వాళ్లు లేరు..ఒక్కొక్కళ్లకు ఊంటాది..’ అంటూ ట్రైలర్ చివరలో జయమ్మ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ చిత్రానికి కెమెరా: అనూష్కుమార్, సంగీతం: కీరవాణి, నిర్మాణ సంస్థ: వెన్నెల క్రియేషన్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విజయ్ కుమార్ కలివరపు.