Budget 2026 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్లోకి పది కీలకాంశాలివి.
1. ఈసారి టాక్స్ పేయర్లకు పెద్దగా ఊరట లభించలేదు. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న కొత్త పన్నుల్లో ఏవైనా పన్ను మినహాయింపులు, కోతలు ఉండొచ్చని భావించినా.. బడ్జెట్లో అలాంటివేమీ ప్రకటించలేదు. అయితే, దేశంలో పెట్టుబడులు పెట్టి, క్లౌడ్ సర్వీసెస్ అందించే డాటా సెంటర్లకు మాత్రం సరళమైన పన్నులు విధించారు. దీనిప్రకారం 2047 వరకు టాక్స్ హాలిడే ఉంటుంది.
2. కేన్సర్ పేషెంట్లకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు సీతారామన్. కేన్సర్ చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అత్యావశ్యక ఔషధాలపై దిగుమతి సుంకాన్ని మినహాయిస్తారు. దీనిలో భాగంగా 17 రకాల ఔషధాలు ధరలు తగ్గుతాయి. అలాగే, అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మరో 7 కీలక ఔషధాలపై కూడా దిగుమతి సుంకాలు తగ్గుతాయి. కేన్సర్ చికిత్సలో వాడే మందులు, ఇతర ఔషధాలు, ఆహార పదార్థాలు, పరికరాలపై కూడా సుంకాలు తగ్గుతాయి.
3. కొత్తగా వచ్చే టెక్నాలజీలపై సమీక్ష జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. సెమీ కండక్టర్ల తయారీ సహా, ఇతర సేవారంగాలకు ప్రోత్సాహకంగా ఐదేళ్లలో రూ.40,000 కోట్లు కేటాయిస్తారు.
4. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను సైన్యానికి రూ.2.19 లక్షల కోట్లు కేటాయిస్తారు. ఇది గత ఏడాదికంటే 21.84 శాతం అదనం. మొత్తం రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు. ఇది మన జీడీపీలో 11 శాతం.
5. వేగంగా, స్తిరమైన అభివృద్ధి సాధించేందుకు తయారీ రంగం, ఇతర చిన్న పరిశ్రమలు వంటి ఆరు కీలక రంగాకు ప్రోత్సాహం అందిస్తారు. ఇండియాను బయో గ్లోబల్ ఫార్మా హబ్‌గా మార్చేందుకు బయో ఫార్మ శక్తి మిషన్ పేరుతో ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయిస్తారు.
6. మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసి వస్త్ర తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తారు. ఖాదీ, చేతి కళా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు మహాత్మా గాంధీ గ్రామ సమాజ్ పథకాన్ని అమలు చేస్తారు.
7. బ్యాంకింగ్ రంగాన్ని సమీక్షించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే విదేశీ మారక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, భారతీయ ఈక్విటీలలో విదేశీయులు పెట్టుబడులు పెట్టేందుకు కూడా కమిటీలను ఏర్పాటు చేస్తారు.
8. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలకు ఏడు హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు. ఇందులో హైదరాబాద్‌కు సంబంధించి రెండు రైళ్లు నడుస్తాయి. ఒకటి చెన్నై, రెండోది పుణే.
9. రేర్ ఎర్త్ మినరల్స్ (అరుదైన ఖనిజాలు) కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తారు. తమిళనాడు, ఏపీ, కేరళ, ఒడిశాలో ఈ కారిడార్లు ఏర్పాటవుతాయి.
10. మెడికల్ టూరిజంను ప్రోత్సహించేందుకు ప్రత్యేక హబ్స్ ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా ఆయుష్ కేంద్రాల పేరుతో ఐదు మెడికల్ హబ్స్ ఏర్పాటు చేస్తారు.