RohitShetty | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న అతడి ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున కొందరూ గుర్తు తెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల పాటు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అర్థరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు రోహిత్ శెట్టి ఇంటిని లక్ష్యంగా చేసుకుని గాలిలోకి కాల్పులు జరిపి అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, దర్యాప్తును ముమ్మరం చేశారు.
అయితే ఈ దాడులను తామే చేసినట్లు ప్రకటించింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. ఈ సందర్భంగా దాడిపై సోషల్ మీడియా వేదికగా బాధ్యత వహిస్తూ సంచలన ప్రకటన చేసింది. గ్యాంగ్ సభ్యులు శుభమ్ లోంకర్, ఆర్జూ బిష్ణోయ్‌లతో పాటు హరి బాక్సర్ ఈ కాల్పుల్లో పాల్గొన్నట్లు గ్యాంగ్ పేర్కొంది. తమ పనిలో జోక్యం చేసుకోవద్దని గతంలో రోహిత్ శెట్టిని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడం వల్లే ఈ దాడి చేసినట్లు గ్యాంగ్ సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. ఇది కేవలం ‘చిన్న ట్రైలర్’ మాత్రమేనని మాట వినకుంటే ఇంకోసారి బుల్లెట్లు ఇంటి వెలుపల కాకుండా నేరుగా బెడ్రూమ్లో ఆయన గుండెల్లోకి దిగుతాయని హెచ్చరికలు జారీ చేసింది.
అంతేకాకుండా తమ హెచ్చరికలను లెక్కచేయని వారికి మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితి ఎదురవుతుందని వారు హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన వారిలో ఒకరైన శుభమ్ లోంకర్ ఇప్పటికే బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరుసగా బాలీవుడ్ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపులతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అత్యంత అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.