పంద్రాగస్టు పూర్తయింది. రొమ్ము విరిచి దేశభక్తిని చాటుకున్నామంతా! సెల్యూట్ కొట్టి జాతీయ పతాకానికి వందనం సమర్పించుకున్నాం కూడా! రోజు గడిచింది.. వీధివీధిలో నిన్నంతా రెపరెపలాడిన తిరంగాలు చెత్త కుప్పల దగ్గర కనిపిస్తాయి. తోరణాలుగా కట్టిన మువ్వన్నెల జెండాలు.. చిరుగులతో గాల్లో కొట్టుకుపోతూ దర్శనమిస్తాయి. దేశభక్తికి సవాలు విసురుతున్న మన నిర్లక్ష్యాన్ని చూసి ఊరుకోలేదు ప్రియ రంజన్. మిన్నుల్లో మెరిసిన పతాకం వీధి పాలవకుండా కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. చెత్తలో, మురుగుకాల్వల్లో జెండా కనిపిస్తే చాలు.. భద్రంగా ఏరుకొని ఇంటికి తీసుకెళ్తాడు. పద్నాలుగేండ్లుగా జెండాలు సేకరిస్తూ, భద్రపరుస్తూ ‘ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు ప్రియ రంజన్ సర్కార్. జెండాను కాపాడుకుందామని చెప్పడానికి, జెండా ఎగురవేసి దేశభక్తిని చాటడానికి హైదరాబాద్ వచ్చాడు. దేశభక్తి నా వారసత్వం అంటున్న ఫ్లాగ్ మ్యాన్ ప్రియ రంజన్ సర్కార్ చెప్పిన తిరంగా ముచ్చట్లివి..
చిన్నప్పుడు అమ్మతో కలిసి వెళ్తుంటే.. దారిలో జాతీయ జెండా కనిపించింది. నేల మీద ఉన్న ఆ జెండాను అమ్మ వెంటనే అందుకుంది. మట్టిలో దొర్లాడే బిడ్డను తల్లి ఎత్తుకున్నట్టుగా.. అమ్మ ఆ జెండాను తీసుకోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. త్రివర్ణ పతాకాన్ని అమ్మ కళ్లకు అద్దుకుంటుంటే.. ‘ఎందుకమ్మా దుమ్ముపట్టిన జెండాను అలా కళ్లకు అద్దుకుంటున్నావ్?’ అని అడిగాను. ‘నీకు నేనెలాగో.. నాకు ఈ జెండా అలా.. మనకందరికీ ఈ జెండా అమ్మలాంటిది. భరతమాత అంటే ఇదేరా’ అని చెప్పింది. ఆ జెండాను ఇంటికి తీసుకువచ్చి అమ్మ పూజించింది. మా తాత నుంచి అమ్మ స్ఫూర్తి పొందింది. అమ్మ నాకు స్ఫూర్తినిచ్చింది.

నిద్రలేవగానే ఏ మతస్తులు ఆ దేవుడిని తలుచుకుంటారు. స్నానమాచరించాక ప్రార్థన చేసుకుంటారు. మా ఇంట్లో కూడా అంతే. జాతీయ జెండాకు దీపం వెలిగించి నమస్కరిస్తాం. భారతమాతే మా దేవత. ఆ దేవతకు రూపం మువ్వన్నెల పతాకం. ఆ దేవతకు అవమానం జరగకుండా స్పందిస్తాను. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటం కోసం పాటుపడతాను. అదే నా అభిమతం. పంద్రాగస్టు, ఛబ్బీస్ జనవరి ఘనంగా జరుపుకొంటాం. ఆ వేడుకలు ముగియగానే చేతిలోని జెండాలను నేలపాలు చేస్తాం. వాటిని రోడ్ల మీద అందరూ తొక్కుతూ నడుస్తుంటారు. కొన్ని మురుగు కాల్వలో కొట్టుకుపోతుంటాయి. చిరిగిపోయి చెట్లకు వేలాడుతుంటాయి. జాతీయ జెండాను గౌరవించడం ఇలాగేనా? మన దేశంలో నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఉంది.
జాతీయ పతక గౌరవానికి భంగం కలిగించడం శిక్షార్హమైన నేరం. చట్టాలు చేయడం తప్ప శిక్షలు వేయలేని దేశంలో జాతీయ జెండా అవమానాలు పడుతూనే ఉంది. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన పెంచాలని కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. నీటిపారుదల శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగం నాది. నాకొచ్చే జీతం అంతంతే! ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. నేను అనుకున్నది చేయాలనే నిశ్చయించుకున్నాను. కాగితం, ప్లాస్టిక్ జెండాలను రోడ్లపై ఏరడమే పనిగా పెట్టుకున్నాను. మురుగు కాల్వల్లో నుంచి తీశాను. అలా చేస్తుంటే చాలామంది నవ్వారు, పిచ్చోడనుకున్నారు. దొంగని తరిమారు. ‘నీ ఒక్కడితో సమాజం మారుతుందా?’ అని ప్రశ్నించారు. అలా సేకరించిన జాతీయ జెండాలను పెద్ద ట్రంకు పెట్టెల్లో దాచి పెట్టాను. వాటిని రీ సైక్లింగ్ చేసి పర్యావరణానికి హాని కలగకుండా చేస్తాను.

ఈ క్రతువును ఒక్కడిగా మా ఊరు బాల్లి (పశ్చిమ్ బెంగాల్లోని హౌరాకు సమీప పట్టణం)లో మొదలుపెట్టాను. నన్ను చూసి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. నేలపాలైన జెండాలను వాళ్లూ సేకరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పద్నాలుగేండ్లలో చాలా మార్పు తీసుకురాగలిగాం. బెంగాల్ మొత్తం జాతీయ జెండాను గౌరవప్రదంగా చూసుకోవడం గురించి ప్రజలకు అవగాహన కల్పించాం. దేశమంతటా ప్రచారం చేయాలన్నదే నా ప్రస్తుత లక్ష్యం.
మూడేండ్ల పాటు విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే హైదరాబాద్కు వచ్చాను. జెండాను ఎగురవేసే నిబంధనలు అందరూ పాటించాలి. ఎగురవేసి వదిలివేయొద్దు. దానిని జాగ్రత్తగా కాపాడాలి. ప్లాస్టిక్ జెండాలను పక్కన పెడదాం, ఖాదీ జెండాలను అందుకుందాం. జాతీయ జెండాకు గౌరవం పెంచడం, భరతమాతకు గుడి కట్టాలన్నది నా రెండో లక్ష్యం.
– నాగవర్ధన్ రాయల