e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home News సరస్వతీ పుత్రులకు సాయం చేయరూ!

సరస్వతీ పుత్రులకు సాయం చేయరూ!

  • జాతీయస్థాయి పరీక్షల్లో నెగ్గినా వేధిస్తున్న పేదరికం
  • సీటు పొందినా ఫీజు చెల్లించలేని దయనీయస్థితి
  • సాయం అందించాలని దాతలకు వేడుకోలు

బెల్లంపల్లి రూరల్‌, నవంబర్‌ 24: ఒకపూట తింటే మరోపూట పస్తులుండే కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు వీరంతా. రోజువారీ కూలీ కుటుంబాల నేపథ్యం. గురుకుల పాఠశాలల పుణ్యమా విద్యార్థులుగా అక్షరబాట పట్టారు. చదువుపట్ల అంకితభావం, మొక్కవోని దీక్షతో గురుకులాలకే వన్నె తెచ్చారు. టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కు లు పొందడమే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో నిర్వహించే జాతీయస్థాయి పరీక్షల్లో సత్తాచాటారు. కార్పొరేట్‌ కళాశాలలే ఔరా అనేలా.. అత్యుత్తమ ర్యాంకులను సొంతం చేసుకున్నారు. దేశంలోనే పేరెన్నికగన్న యూనివర్సిటీల్లో సీట్లు సాధించారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సీవోఈ) విద్యార్థులు నందనకారి సాయితేజ, దుర్గం రంజిత్‌, ఓరగంటి తన్మయ్‌, మంచాల పవన్‌ కుమార్‌, రాంటెంకి అరుణ్‌కుమార్‌, మీసాల రాజాసాగర్‌లు ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. సీవోఈలో ఇచ్చిన కోచింగ్‌ను సద్వినియోగం చేసుకొని జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్డ్స్‌-2021, సిఫ్‌నెట్‌, ఐహెచ్‌ఎం, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ లాంటి పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధించారు. రంజిత్‌ వరంగల్‌ నిట్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌, సాయితేజ వరంగల్‌ నిట్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సీటు పొందారు.

- Advertisement -

రాజాసాగర్‌కు ఢిల్లీలోని ఆచార్య నరేంద్రదేవ్‌ యూనివర్సిటీలో బీఎస్సీ ఆనర్స్‌, అరుణ్‌కుమార్‌కు తిరువనంతపురంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో, తన్మయ్‌, పవన్‌కుమార్‌లకు కొచ్చిలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ నాటికల్‌ ఇంజినీరింగ్‌ ట్రైనింగ్‌లో బీఎస్సీ ఫిషరీస్‌ అవకాశం దక్కింది. అత్యున్నత విద్యాసంస్థల్లో చదివేందుకు అర్హత సాధించారు కానీ పేదరికం వీరి ఉన్నత చదువుల స్వప్నానికి అడ్డంకిగా మారింది.

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వీరికి కౌన్సెలింగ్‌ ఫీజు, టర్మ్‌ ఫీజులు చెల్లించే స్థోమత లేదు. ఎవరైనా దయార్థ హృదయులు ముందుకొచ్చి తమ ఉన్నత చదువులకు సాయమందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు బెల్లంపల్లి సీవోఈ వైస్‌ ప్రిన్సిపాల్‌ కోట రాజ్‌కుమార్‌ను 9849479189 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement