కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గంలో పోలింగ్‌కు పోలీస్ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గురువారం ఓటింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బరిలోకి దిగారు. బీజేపీ ప్రియాంక టిబ్రేవాల్‌ను పోటీకి దింపింది. సీపీఎం నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ పోటీలో ఉన్నారు. ఎన్నికల కోసం అధికారులు 287 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు.
ప్రతి బూత్‌లో సగం సెక్షన్, ముగ్గురు జవాన్లు, కేంద్ర బలగాలను మోహరించనున్నారు. కోల్‌కతా పోలీసు అధికారులు బూత్‌ల వెలుపల భద్రత ఏర్పాట్లు చూడనున్నారు. భవానీపూర్ వ్యాప్తంగా 38 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. పోలింగ్ రోజున 22 సెక్టార్ మొబైల్, తొమ్మిది హెచ్ఆర్ఎఫ్ఎస్ (హెవీ రేడియో ఫ్లైయింగ్ స్క్వాడ్) బృందాలు, 13 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్‌ను మోహరించనున్నట్లు చెప్పారు. ఉప ఎన్నిక కోసం నలుగురు జాయింట్ పోలీస్ కమిషనర్లు, 14 మంది డిప్యూటీ కమిషనర్లు, సమాన సంఖ్యలో అసిస్టెంట్ కమిషనర్లను నియమించినట్లు పేర్కొన్నారు.
అదనంగా మూడు అదనపు కంట్రోల్ రూమ్‌లను కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో పోలీసులందరూ రెయిన్ కోట్లు ధరించాలని, గొడుగులు తీసుకోళ్లాలని కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సంఘం నీటిపారుదల శాఖను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల్లో వరద నిలువకుండా చూడాలని ఆదేశించింది. భవానీపూర్‌తో పాటు జంగీపూర్, సంసర్గంజ్లోనూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి ఒకరు చెప్పారు. ఓట్ల ఫలితాలు అక్టోబర్ 3న లెక్కించనున్నట్లు వివరించారు.