ఇటీవలి కాలంలో చాలామందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగి, తమ దినచర్యలో రకరకాల గింజలను భాగం చేసుకుంటున్నారు. ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మైక్రో న్యూట్రియెంట్లు పుషలంగా ఉండే చియా, అవిసె, నువ్వులు వంటి గింజలను సూపర్ ఫుడ్స్‌గా భావిస్తారు. అయితే ఆహారంలో గింజలను చేర్చుకోవడం ఎంత ముఖ్యమో, వాటిని సరైన కాంబినేషన్లో తీసుకోవడం కూడా అంతే అవసరం. నువ్వులు-రాగి పిండి: ఎముకల బలానికి నువ్వులు ఎంతో దోహదం చేస్తాయి.
నువ్వులను పొడి చేసి, మనం రోజూ చేసుకునే రాగి రొట్టెలు లేదా సంకటి పిండిలో కలిపి వండుకోవచ్చు. నువ్వులు, రాగి రెండింటిలోనూ క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. చియా గింజలు – పెరుగు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు, ఫైబర్ మెండుగా ఉండే చియా గింజలను నేరుగా తినకూడదు. వీటిని కొద్దిసేపు నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన చియా గింజలను పెరుగులో కలుపుకొని తింటే శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్ లభించడంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. సబ్జా గింజలు-కొబ్బరి నీళ్లు: మలబద్ధకంతో బాధపడేవారికి ఇది అద్భుతమైన చిటా.
సబ్జా గింజలను కొద్దిసేపు నీటిలో నానబెట్టి, తాజా కొబ్బరి నీళ్లలో కలుపుకొని తాగాలి. ఈ కాంబినేషన్ శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అవిసె గింజలు-సోంపు: అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని దోరగా వేయించి, పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని కొద్దిగా సోంపుతో కలిపి భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్ లాగా తీసుకోవాలి. ఇది తిన్న ఆహారం త్వరగా అరగడానికి సహాయపడటమే కాకుండా కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు-పండ్లు: గుమ్మడి గింజలలో మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు పుషలంగా ఉంటాయి. వీటిని దోరగా వేయించి, ఫ్రూట్ సలాడ్‌పై చల్లుకుని తింటే మంచి రుచితో పాటు శరీరానికి కావలసిన మెగ్నీషియం అందుతుంది.