Health Insurance | న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ఆరోగ్య బీమా తీసుకున్నవారికి ఆసుపత్రులు గట్టి షాకిస్తున్నాయి. క్లెయిం సెటిలమెంట్లలో చాలా కొరివిలు పెడుతున్నాయి. దీంతో వేలాది కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయింలు తిరస్కరణకు గురవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తాజాగా విడుదల చేసిన నివేదికలోనూ ఇదే విషయం స్పష్టమైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,100 కోట్లు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయింల తిరస్కరించబడ్డాయని తెలిపింది. మొత్తం క్లెయిం సెటిల్మెంట్లలో వీటి వాటా 12.9 శాతంగా ఉన్నదని పేర్కొంది.
రూ.1.17 లక్షల కోట్ల క్లెయిం సెటిల్మెంట్లలో రూ.83,493.17 కోట్లు లేదా 71.29 శాతం చెల్లింపులు జరిపారని తన వార్షికపు నివేదికలో వెల్లడించింది. వీటితోపాటు బీమా సంస్థలు రూ.10,937.18 కోట్ల క్లెయింలను తిరస్కరించగా, రూ.7,584.57 కోట్లు చెల్లింపులు జరుపాల్సివున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 3.26 కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు క్లెయింలుకాగా, వీటిలో 2.69 కోట్లు(82.46 శాతం) చెల్లింపులు జరిగాయి. ఒక్కో క్లెయిం సరాసరి రూ.31,086గా ఉన్నట్లు తెలిపింది. క్లెయిం సెటిల్మెంట్లలో 66.16 శాతం క్యాష్‌లెస్ పద్దతిన సెటిల్ కాగా, 39 శాతం రియంబర్స్మెంట్ పద్దతిన జరిగాయని పేర్కొంది.