జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం.. ఆధారం సర్వ విద్యానాం.. హయగ్రీవముపాస్మహే!! ఈ శ్లోకం హయగ్రీవస్వామిని ఆరాధించే క్రమంలో ప్రధానంగా చెబుతారు. ఆధారం సర్వ విద్యానాం.. సకల విద్యలకు ఆధార భూతమైన స్వామి హయగ్రీవుడు. ఆ స్వామిని ధ్యానిస్తే అన్ని విద్యలు లభిస్తాయి. నారాయణుడు ధరించిన మొదటి రూపం హయగ్రీవుడు. మత్స్యకూర్మవరాహ అవతారాల కన్నా ముందు అవతారంగా దీనిని పురాణాలు చెబుతున్నాయి.
నారాయణుని గురు రూపం హయగ్రీవస్వామి. శివుని గురు స్వరూపం దక్షిణామూర్తి, అమ్మవారి గురుమూర్తి సరస్వతీ దేవి. ఇలా ముగ్గురు మూర్తుల గురు స్వరూపాలు జ్ఞానాన్ని, విద్యను అందించేవిగా లోకంలో పూజలు అందుకుంటున్నాయి. సమస్త జ్ఞానాన్ని సరైన స్థానంలో పునఃస్థాపించడం హయగ్రీవ స్వామి బాధ్యత. భారతీయ సనాతన సంప్రదాయంలో విష్ణువు తొలి అవతారంగా గుర్రం తల కలిగిన మానవాకారంగా హయగ్రీవుడు ఆవిర్భవించిన పుణ్యదినం శ్రావణ పౌర్ణమి. హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకోసం ఈరోజున కొందరు అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు.
హయగ్రీవ ఆవిర్భావం గురించి ఒక పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. సృష్టికి పూర్వం సర్వం జలమయమైనప్పుడు నారాయణుడు భుజగశయనుడై ఉండగా ఆయన నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన అనుగ్రహం వల్ల బ్రహ్మకు వేదవిద్య లభించింది. ఆ విద్యతో బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయబోతుండగా ఆ జలంలో ఉన్న తమో, రజో గుణాల వికారంతో మధుకైటభులనే ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. వారు అక్కడే ఉన్న బ్రహ్మ నుంచి వేదాలు అపహరించి సముద్రగర్భంలో దాచుతారు. తనకేం చేయాలో తెలియక బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన ఒక దివ్యమైన అవతారం ధరించి వస్తాడు. అదే హయగ్రీవ స్వరూపం.
తాను గురు స్వరూపుడుగా, విద్యావతారంగా, ఆద్యావతారంగా అవతరించి తనలోని శబ్దాన్ని సకిలింతగా చేశారు. దానినే హేష అంటారు. అది అవ్యక్తమైన మధుర ధ్వని. అందులో గాంభీర్యం, మధురత్వం, దివ్యత్వం ఉంది. పాతాళంలో ఉన్న మధుకైటభులకు ఈ ధ్వని వినిపించింది. వారు ఆ ధ్వని పట్ల ఆకర్షితులై వేదాలను అక్కడే వదిలేసి రాగా, అదే సమయంగా భావించిన హయగ్రీవుడు వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మకు అప్పగిస్తాడు. తర్వాత ఆ రాక్షసులను నారాయణుడిగా సంహరిస్తాడు. ఇది హయగ్రీవుని అవతార సన్నివేశం.
బ్రహ్మ అంటే భ్రమ కానిది. అంటే జ్ఞానసంపద. దీనిని రాక్షసగతం కాకుండా అహంకారపూరితంగా, వాంఛల వెంట పరుగెత్తే దృష్టి లేకుండా చేస్తూ ఆ జ్ఞానసంపదను అందుకునేలా చేసేది హయగ్రీవ అవతారం. బ్రహ్మను రక్షించడం అంటే మేధాశక్తిని పరిరక్షించడమే. అందుకోసమే మన మేధాశక్తిని, పరమేశ్వరుడు ఇచ్చిన విద్యను రాక్షస శక్తులు కబళించకుండా ఉండాలంటే హయగ్రీవుని ధ్యానించాలి.
ముఖంతో ఉన్న ఆ స్వామికి నమస్కారం. అశ్వ శబ్దానికి అర్థం అశుం వ్యాప్తౌ.. అంటే వ్యాపించే లక్షణం, వేగ గమన లక్షణం అని అర్థం. విద్య కూడా కాంతి స్వరూపమే. అది వేగంగానూ, విస్తృతంగానూ వ్యాపిస్తుంది. వ్యాపక లక్షణం కలిగిన విద్య ఏ ఒక్కరి దగ్గర ఆగిపోకుండా పరంపరగా కొనసాగాలి. అజ్ఞానాన్ని తొలగించి ప్రకాశాన్ని కలిగించేది విద్య. స్వామి శరీరం శబ్దమయం, మంత్రమయమైనది. అందులో కింది భాగం నరాకృతి కాగా, ఆయన హేషలో అస్పష్టమైన నాదం ఉంది. ఈ నాదం అంటే హయగ్రీవుని ఊపిరి నుంచే వేదవిద్యలన్నీ ఉద్భవించాయి. అస్పష్టమైన నాదస్థానమే అశ్వశిరస్సు కాగా ఈ అశ్వముఖమే ఓంకారమని విష్ణుపురాణం చెబుతున్నది. సప్తకోటి మహామంత్రాలు, యజ్ఞాలు రూపంగా ఏర్పడితే హయగ్రీవుడు.
యజ్ఞంలో ఉన్న మంత్రం, యజ్ఞం, దేవత అనే మూడు అంశాల సమాహారమూర్తి హయగ్రీవుడు. యజ్ఞాలలో, వేదాలలో చెప్పే మంత్రాలన్నిటి స్వరూపంగా సకల దేవతలను తన అవయవాలలో కలిగి ఉన్న నారాయణ స్వరూపం హయగ్రీవమూర్తి. స్వామి నామాన్ని ఎవరైతే జపిస్తుంటారో వారికి గంగానదీ ప్రవాహంతో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుందని మహర్షులు చెప్పారు. వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం కనిపిస్తుంది.
హయగ్రీవుడు శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకం ధరించి ఉంటాడు. శంఖం వేదమయం, చక్రం విశ్వకాల చక్రాన్ని తెలుపుతుంది. బ్రహ్మ విద్యకు సంకేతంగా చిన్ముద్ర ధరించాడు స్వామి. లౌకిక విద్యను తెలపడానికి సంకేతంగా పుస్తకం ఉంటుంది. ఆయన కూర్చున్న కమలం తెల్లగా ఉండి లక్ష్మీదేవి ఒళ్లో కూర్చుని ప్రకాశిస్తుంది. ఇది లక్ష్మీహయగ్రీవ స్వరూపం. ఏ మూర్తిని మనం ధ్యానిస్తే దానికి అనుగుణంగా ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవితో కూడిన స్వామిని పూజించడం వల్ల ఎప్పుడూ ఐశ్వర్యాన్ని పొందడంతో పాటు సమస్త విద్యలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్పాయి. ఐశ్వర్యం అంటే కేవలం భౌతికమైనదే కాకుండా మోక్షలక్ష్మి కూడా!
మహాభారతంలో గాలవుడనే మహర్షి హయగ్రీవ ఉపాసన చేసినట్లుగా తెలుస్తున్నది. భాగవతంలో భద్రశ్రవసుడనే చక్రవర్తి తన రాజ్యంలో హయగ్రీవ ఉపాసనను వ్యాప్తి చేశారు. అనుష్ఠించేవారి సంఖ్యను బట్టి ఆ ప్రాంతంలో ఒక్కో ఉపాసన వ్యాప్తి చెందుతుందని ఈ గాథ చెబుతుంది. అంతేకాకుండా ఉపనిషత్తులలో హయగ్రీవ ఉపనిషత్తు అని ప్రత్యేకించి చెప్పారు. ఇది మంత్రశాస్ర్తానికి సంబంధించినది. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయి, సమస్త సమస్యలు తీరుతాయి. వైష్ణవ గురుపరంపరలోని ప్రముఖులైన వేదాంత దేశికులు తిరువేంగి క్షేత్రంలో హయగ్రీవదర్శనం పొంది ఆ స్వామిపై 32 శ్లోకాలు రచించారు. అందులో హయగ్రీవునికి సంబంధించిన మంత్రతంత్ర రహస్యాలను నిక్షిప్తం చేశారు. అందుకే హయగ్రీవ స్వామిని శ్రావణ పౌర్ణమి రోజున ఇలా పూజిస్తూ అర్చించాలి.
మేధాం విద్యాం బలం ప్రజ్ఞాం సంపదం పుత్రపౌత్రకాన్
దేహిమే సకలం దేవ హయశీర్ష నమోస్తుతే॥
– రంగనాథ్ మిద్దెల, 9866573461