న్యూఢిల్లీ, ఆగస్టు 23: పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడి 10 రోజులైనా అధికారికంగా వర్షాకాల సమావేశాలు ఇంకా ముగియలేదు. దీంతో కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయకుండానే ఒక కీలకమైన చట్టాన్ని ఆమోదించాలని కేంద్రం యోచిస్తున్నదని, పార్లమెంట్‌ను తిరిగి సమావేశపరుస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. లోక్‌సభ, రాజ్యసభలు ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడ్డాయి. అలా జరిగిన తర్వాత సాధారణంగా మూడు నాలుగు రోజుల తర్వాత (ఒక్కోసారి అదే రోజు) అధికారికంగా సమావేశ కాలం ముగిసినట్టు ప్రొరోగేషన్ నోటిఫికేషన్ జారీ చేయాలి.
అయితే ఆదివారం వరకు వర్షాకాల సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వు విడుదల చేయలేదు. డీలిమిటేషన్‌తో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించి, 2029 పార్లమెంట్ ఎన్నికల నాటికి రిజర్వేషన్లు కల్పించాలన్న ధ్యేయంతో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను తిరిగి సమావేశ పరుస్తుందన్న ప్రచారం జరుగుతున్నది. వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడి 10 రోజులైనా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయకపోవడాన్ని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఆదివారం ప్రశ్నించారు.