హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : ‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తామే స్వయంగా టార్గెట్‌ను తగ్గించుకోవడం అన్నదాతలను నిలువునా మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. గతంలో నిర్ణయించిన 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యాన్ని 75 లక్షల మెట్రిక్ టన్నులకు సైలెంట్‌గా తగ్గించిన పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. మరికొన్ని రోజుల్లో ఏకంగా ‘కొనుగోళ్లు పూర్తయ్యాయి’ అని ప్రకటించినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని ప్రభుత్వం నిశ్శబ్దంగా తగ్గించడంపై శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఈ సీజన్లో కోటీ 41 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నదని, కానీ కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం చేయడం వెనుక అంతరార్ధం ఏమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. 2020-21 యాసంగిలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 92.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి అని హితవు పలికారు.
‘వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా? రోజుల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాచింది అబద్ధమా? అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోయింది అబద్ధమా? నెలల తరబడి కొనుగోలును ఆలస్యం చేసింది అబద్ధమా?’ అని హరీశ్‌రావు నిలదీశారు. ఏసీ గదుల్లో కూర్చొని ప్రసంగాలు దంచితే రైతుల గోడు తీరదని, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడాలని, వారి కన్నీళ్లు తుడువాలని సూచించారు.