Harish Rao | నటుడు ప్రియదర్శి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాతో పాటు అందులో తాను పోషించిన శంకరన్న పాత్ర గురించి ప్రియదర్శి ఆయనతో చర్చించారు. అలాగే తన సినీ ప్రయాణం, ప్రస్తుతం చేస్తున్న సినిమాలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి కూడా హరీశ్ రావుతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక సమాజానికి ఎలా స్ఫూర్తిగా నిలుస్తాయో తెలంగాణ ఉద్యమం ద్వారా చూశామని హరీశ్ రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒక జాతి గుర్తింపు కోసం సాగిన పోరాటాన్ని ‘ది ప్యారడైజ్’ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రభావవంతంగా చూపించారని ఆయన అన్నారు.
ఆ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి కనిపించిన తీరును హరీశ్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాటతీరు వంటి అంశాలను తెరపై సహజంగా ఆవిష్కరించడం అంత సులభం కాదని, అయితే ప్రియదర్శి ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారని అన్నారు. కేసీఆర్ను పోలిన హావభావాలను ప్రియదర్శి ఎంతో సహజంగా పలికించారని హరీశ్ రావు అభినందించారు. పాత్రలో ఆయన చూపించిన నటన ప్రేక్షకులకు బలమైన అనుభూతిని కలిగించిందని పేర్కొన్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రబృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ యాస, పల్లె జీవితాన్ని ప్రతిబింబించే కథలకు ప్రియదర్శి ఒక ప్రత్యేక గుర్తింపుగా మారారని హరీశ్ రావు అన్నారు. గతంలో వచ్చిన ‘మల్లేశం’ సినిమాలో తెలంగాణ చేనేత కార్మికుల జీవితాలను, ‘బలగం’ చిత్రంలో తెలంగాణ పల్లె సంస్కృతి, కుటుంబ బంధాలను తన నటన ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తుచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి స్వయంకృషితో మంచి నటుడిగా ఎదిగిన ప్రియదర్శి ప్రయాణం తెలంగాణకు గర్వకారణమని హరీశ్ రావు పేర్కొన్నారు. మట్టి కథలకు, తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత విస్తృతంగా ప్రేక్షకులకు చేరువ చేసేలా భవిష్యత్లో ప్రియదర్శి మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని హరీశ్ రావు కోరారు.
ఈ సందర్భంగా హరీశ్ రావుకు ప్రియదర్శి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యల కోసం పనిచేసే నాయకుడిగా హరీశ్ రావు సంపాదించుకున్న గుర్తింపు వెనుక ఎంతో కృషి ఉందని పేర్కొంటూ ఆయనపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ భేటీ సందర్భంగా సినిమా, తెలంగాణ సంస్కృతి, భవిష్యత్ ప్రాజెక్టులపై ఇద్దరి మధ్య ఆత్మీయంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Congratulated and felicitated actor @Preyadarshe
From Balagam and Mallesham to portraying KCR garu as MLA Shankaranna in #TheParadise his mannerisms, dialect, and screen presence are remarkable.
“చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!”
Congratulations to the… pic.twitter.com/zJGY81Wbyo
— Harish Rao Thanneeru (@BRSHarish) September 30, 2026