Dhanteras 2021 | ధంతేరస్.. దీపావళి పండుగకు ముందు త్రయోదశి నాడు వస్తుంది ఈ పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధంతేరస్ పర్వదినం జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ రెండో తేదీ (మంగళవారం) ధంతేరస్ వచ్చింది. ధంతేరస్తోనే దీపావళి పండుగ వేడుకలు మొదలవుతాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ ధంతేరస్ పర్వదినం వేడుకలు ఈ నెల ఆరో తేదీ (కార్తీక శుద్ధ విదియ) వరకు వరకు కొనసాగుతాయి.
అంతేకాదు.. దీపావళికి ముందు వచ్చే ఈ త్రయోదశిని ధన్తేరాస్.. ధన త్రయోదశి.. ధంతేరస్.. చోటీ దీపావళి అంటారు. ధన త్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు పెంచే త్రయోదశి అని అర్థం. ధంతేరస్ నాడు ధన్వంతరికి, కుబేరుడితోపాటు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. దేవదానవులు సముద్ర మధనం చేస్తున్న వేళ.. ధన్వంతరి భగవానుడి చేతిలో కలశంతో దర్శనం ఆచ్చారని అంతా నమ్ముతారు.
ధంతేరస్ నాడు బంగారం, వెండి.. విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తే కలిసిరావడంతోపాటు శుభప్రదం అని చెబుతారు. ఈ రోజు ఏం కొనుగోలు చేసినా రెట్టింపవుతుందని విశ్వాసం. ఈ పర్వదినం నాడు పలు వస్తువులను కొనుగోలు చేస్తారు. కానీ కొద్ది మందికి మాత్రమే ధంతేరస్ నాడు ఏమేమీ కొనుగోలు చేయాలో తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో ధంతేరస్ నాడు ఏ షాపింగ్ చేయాలో తెలుసుకుందాం..
బంగారం, వెండి వస్తువులతోపాటు వెండి లక్ష్మి, గణేశుడి విగ్రహాలను కొనుగోలు చేయవచ్చు. చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు. ఈ రోజు చీపురు కొనడంతో పేదరికం, కష్టాలు, అనారోగ్య సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ప్రతీతి. వాహనం కొనడం కూడా శ్రేయస్కరమేనని.. మీరు కారు.. బైక్.. స్కూటర్ కొనాలనుకున్నా కొనుగోలు చేయవచ్చు.
దృక్ పంచాంగం ప్రకారం ధంతేరస్ పూజ ముహూర్తం సాయంత్రం 6.17 గంటల నుంచి రాత్రి 8.11 గంటల వరకు. త్రయోదశి తిథి మంగళవారం మధ్యాహ్నం 11.31 గంటల నుంచి బుధవారం ఉదయం 9.02 గంటల వరకు ఉంటుంది. ప్రదోశ్ కాలం సాయంత్రం 5.35 గంటల నుంచి రాత్రి 8.11 గంటల వరకు.. వృషభ కాలం సాయంత్రం 6.17 గంటల నుంచి రాత్రి 8.12 గంటల వరకు ఉంటుంది. మంచి ఆయురారోగ్యాల కోసం ధంతేరస్ సందర్భంగా విష్ణుదేవుడికి పూజలు చేయాలి. విష్ణువుకు ధన్వంతరి ప్రతిరూపం అని భావిస్తారు.
గోధుమలు, మినుములు, పెసళ్లు, బార్లీ, శనగలు, బియ్యం, కాయధాన్యాలతో పూజ చేయాలి. ఈశాన్య దిక్కుగా పరిశుభ్రం చేసుకుని పూజ పూర్తయ్యాక మంగళదీపాలు వెలిగించాలి. పూలు, పండ్లు, తీపిమిఠాయిలు సమర్పించాలి.