Hanu Abbavaram | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే తన భార్య, నటి రహస్య గోరక్ పండంటి మగబిడ్డకి జన్మించిన సంగతి తెలిసిందే. తొలిసారి బాబుతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని, అక్కడే నామకరణ సంబరాలు నిర్వహించారు. తిరుమలలో సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కుటుంబానికి ఆలయ అధికారులు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాలతో సత్కరించారు. దర్శనం తర్వాత కిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకి తొలిసారి మా బాబుతో వచ్చాం. ఇక్కడే నామకరణం చేశాం. మా కొడుక్కి ‘హను అబ్బవరం’ అనే పేరు పెట్టాం. ఇది నాకు ఒక జీవిత కాలం గుర్తుండే క్షణం. శ్రీవారి దీవెనలతో మా కుటుంబం ఆనందంగా ఉంది అన్నారు.
హనుమాన్ జయంతి రోజునే అంటే, 2025 మే 22న, హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రహస్య గోరక్ డెలివరీ అయ్యింది. బిడ్డ పాదాలను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేస్తూ, కిరణ్ ..ఈ హనుమత్ జయంతికి దేవుడు నిజంగా బహుమతి ఇచ్చాడు అని పోస్ట్ చేశారు. హనుమాన్ జయంతి రోజు పుట్టిన సందర్భంగా తన కొడుక్కి హను అబ్బవరం అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో తమ కుమారుడి ఫేస్ రివీల్ చేస్తూ.. లార్డ్ హనుమాన్, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో కొడుక్కి హను అబ్బవరం అని పేరు పెట్టాం అని రాసుకొచ్చాడు కిరణ్.
ప్రస్తుతం K-Ramp, చెన్నై లవ్ స్టోరీ వంటి సినిమాల్లో నటిస్తున్న కిరణ్ అబ్బవరం, ఈ నెలలో మరో కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గతంలో వచ్చిన ‘క’ మూవీకి సీక్వెల్‌గా ఈ K-Ramp రూపొందుతోంది. ఇక 2019లో రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్, అదే సినిమాలో నటించిన రహస్య గోరక్‌ని ప్రేమించి, 2024లో పెళ్లి చేసుకున్నారు. ఇక కిరణ్ కుమారుడికి “హను” అనే పవిత్రమైన పేరు పెట్టినందుకు అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. “హనుమంతుని దీవెనలతో హను అబ్బవరం కూడా తన తండ్రిలా మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.