న్యూఢిల్లీ: రాసి పెట్టి ఉంటే దక్కాల్సింది ఎలాగైనా దక్కి తీరుతుంది అంటారు. మొన్న టోక్యో ఒలింపిక్స్‌లో ఈ జమైకా అథ్లెట్ గోల్డ్ మెడల్ గెలవడం చూస్తే ఇది కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. లేకపోతే అడ్రెస్ తప్పిపోయి ఓ స్టేడియానికి వెళ్లాల్సిన వాడు మరెక్కడికో వెళ్లాడు. చివరికి ఓ వలంటీర్ సాయంతో చివరి నిమిషంలో తాను చేరాల్సిన చోటుకు చేరుకోవడమే కాదు ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాదు ఈ అద్భుతం సాధ్యం కావడంలో సాయపడిన ఆ వలంటీర్‌కు ఇప్పుడు కృతజ్ఞతలు కూడా చెబుతూ ఆ రోజు ఏం జరిగిందో వివరించాడు. ఒలింపిక్స్‌లో 110 మీటర్ల హర్డిల్స్ రేసు గెలిచిన జమైకా స్ప్రింటర్ హాన్స్లే పార్చ్మెంట్ ( Hansle Parchment )కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. అదేంటో మీరూ చూసేయండి.
ఆ రోజు ఏం జరిగింది?
ఒలింపిక్స్ 110 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్ నాడు పార్చ్మెంట్ తాను ఎక్కాల్సిన బస్ కాకుండా మరో బస్సు ఎక్కాడు. అది కాస్తా అతన్ని మరెక్కడికో తీసుకెళ్లింది. మ్యూజిక్ వినడంలో బిజీగా ఉన్న అతడు ఈ విషయాన్ని గమనించలేదు. చివరికి అతడు ఆ బస్సులో ఆక్వాటిక్స్ సెంటర్‌కు వెళ్లాడు. ఇది ఆలస్యంగా గమనించిన పార్చ్మెంట్ వెంటనే విషయాన్ని ఒలింపిక్స్ అధికారులకు చెప్పాడు. అయితే తిరిగి అథ్లెటిక్స్ స్టేడియానికి వెళ్లాలంటే ముందు ఒలింపిక్స్ స్టేడియానికి వచ్చి.. అక్కడి నుంచి మరో బస్సులో వెళ్లాలని వాళ్లు సూచించారు.
కానీ అలా చేస్తే తాను వెళ్లేసరికి సెమీఫైనల్స్ పూర్తవుతాయి. అలాంటి సమయంలో అతనికి ట్రిజానా అనే వలంటీర్ కనిపించింది. ఆమెను సాయం చేయమని అతడు వేడుకున్నాడు. రూల్స్ ప్రకారం ఓ వలంటీర్ నేరుగా ఎలాంటి సాయం చేయడానికి వీల్లేకపోవడంతో.. ఆమె కొంత డబ్బు ఇచ్చి అతడు వెంటనే క్యాబ్‌లో స్టేడియానికి వెళ్లేలా చేసింది. దీంతో అతడు సమయానికి స్టేడియానికి చేరుకోవడం, సెమీఫైనల్లో రెండోస్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై కావడం, అక్కడ ఏకంగా గోల్డ్ గెలవడం జరిగిపోయాయి.
ఆమె చేసిన సాయాన్ని మరచిపోని పార్చ్మెంట్.. ఇప్పుడు ట్రిజానాకు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. గోల్డ్ గెలిచిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఆమెతో కలిసి ఫొటో కూడా దిగాడు. నీ వల్లే నేనీ గోల్డ్ గెలిచానని అతడు చెప్పాడు. ఆమె ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వడంతోపాటు ఓ జమైకా షర్ట్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆమెకు తాను గెలిచిన మెడల్ చూపించాడు. విషయం తెలిసిన జమైకా టూరిజం మంత్రి ఎడ్మండ్ బార్ట్లెట్ కూడా ట్రిజానాకు కృతజ్ఞతలు చెప్పడం విశేషం.