అశ్వారావుపేట/ ఇల్లెందు, అక్టోబర్ 1 : వేతనాల తగ్గింపు జీవోను వెంటనే రద్దు చేయాలని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ డెయిలీ వేజెస్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, అశ్వారావుపేటలో బుధవారం 20వ రోజుకు చేరింది. ఇల్లెందులో ఒంటికాలిపై నిరసన తెలుపగా, అశ్వారావుపేటలో అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చొని నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, పిట్ల అర్జున్, బైటా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ఇండ్లల్లో పండుగ చేసుకుంటుంటే, కార్మికులు పస్తులతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇల్లెందు శిబిరాన్ని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు కాళంగి హరికృష్ణ, బయ్య అభిమన్యులు సందర్శించి, సంఘీభావం తెలిపారు.