హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా చర్లపటేల్గూడెం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న పరిపాలనాపరమైన సమస్యలు, బాలికలపై వేధింపులు, అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. చర్లపటేల్గూడెం ఘటనపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సమర్పించిన లేఖతో పాటు సొసైటీ అసిస్టెంట్ సెక్రటరీ శ్వేతా ప్రియదర్శిని అందించిన సమగ్ర విచారణ నివేదికల ఆధారంగా సొసైటీ కార్యదర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్) శనివారం ప్రిన్సిపాల్ కే శ్రీలతను బదిలీచేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. చర్లపటేల్గూడెంలోని చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్ బాలికల గురుకుల ప్రిన్సిపాల్ కే శ్రీలతను మహేశ్వరం బాలుర గురుకులానికి ప్రిన్సిపాల్‌గా డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు.
అకడ ప్రిన్సిపాల్(ఎఫ్ఎసీ) బాధ్యతల్లో కొనసాగిన జువాలజీ జూనియర్ లెక్చరర్ సీహెచ్ చంద్రకళను మెదక్ జిల్లా అల్లాదుర్గం బాలుర గురుకులానికి వెనకి పంపించారు. ముషీరాబాద్, చార్మినార్ బాలుర గురుకులం ప్రిన్సిపాల్ బీ శిరీషను ఆమె పూర్వస్థానమైన చర్లపటేల్గూడెంలోని చాంద్రాయణగుట్ట బాలికల గురుకులానికి బదిలీ చేశారు. ముషీరాబాద్, చార్మినార్ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పూర్తి అదనపు బాధ్యతలను(ఎఫ్ఏసీ) చార్మినార్ బాలుర గురుకులం తెలుగు జూనియర్ లెక్చరర్ జీ రవికుమార్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.