హైదరాబాద్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ లైబ్రేరియన్స్ అండ్ డాక్యుమెంటలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ఎఎఎల్డీఐ) 2026-2028 నూతన కార్యవర్గ కార్యదర్శిగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ ఎన్పీ రవికుమార్ ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు. నిరుడు (2019-2021)లో ఈ సంస్థకు కోశాధికారిగా సేవలందించిన ఆయన.. ఇప్పుడు జాతీయ కార్యదర్శి బాధ్యతలను చేపట్టనున్నారు. 1971లో ఏర్పాటైన ఎఎఎల్డీఐ, గత ఐదు దశాబ్దాలకు పైగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ గ్రంథాలయాల నిపుణులు, డాక్యుమెంటలిస్టులు, సమాచార పరిశోధకుల వృత్తిపరమైన ఎదుగుదలకు విశేష కృషి చేస్తున్నది.
ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో నాలెడ్జ్ ట్రాన్స్ఫార్మేషన్, పరస్పర సహకారం, డిజిటల్ సమాచార సాంకేతికత, ఆధునిక గ్రంథాలయ సేవలను మరింత బలోపేతం చేయడమే తమ నూతన కార్యవర్గ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదురవుతున్న సవాళ్లను పరిషరించేందుకు సమష్టిగా పని చేస్తామని స్పష్టంచేశారు. కాగా, రవికుమార్‌ను విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, తోటి ఉద్యోగులు అభినందించారు.